Andhrabeats

హరఖ్‌చంద్‌ సావ్లా: క్యాన్సర్‌ రోగులకు దేవుడు

ముంబైలోని పరేల్‌ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి ముందు, ఒక 30 ఏళ్ల యువకుడు రోజూ నిలబడి జనాలను చూసేవాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగుల ముఖాల్లో భయం, వారి బంధువుల నిస్సహాయత అతని మనసును కలచివేసేది. వారిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేదవాళ్లే. ఎవరిని కలవాలో, ఏం చేయాలో కూడా వారికి తెలియని పరిస్థితి. మందులకు, మంచి నీటికి, తిండికి ఆహారానికి కూడా డబ్బులు లేని వారి బాధలు చూసి అతను ఛలించిపోయేవాడు. రాత్రింబవళ్లు వారికి ఏదో ఒకటి చేయాలని ఆలోచించేవాడు.

ఒకరోజు అతని ఆలోచనలు చరిత్ర సృష్టించే దిశగా మళ్లాయి. వారికి ఉచితంగా ఆహారం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం బాగా నడుస్తున్న తన హోటల్‌ను వేరే వారికి అద్దెకు ఇచ్చాడు. తన దగ్గరున్న డబ్బుతోపాటు కొందరి నుంచి సేకరించిన డబ్బుతో టాటా ఆసుపత్రి ఎదురుగా కొండాజీ చాల్‌ దారిలో చిన్న క్యాంటీన్‌ ఒకటి పెట్టాడు. అక్కడ క్యాన్సర్‌ రోగులకు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించేవాడు. ఆరోజు అతను మొదలు పెట్టిన ఆ పని 27 ఏళ్ల నుంచి అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది.

మొదట 50–60 మందితో ప్రారంభమైన ఈ సేవ, క్రమంగా 100, 200, 300 దాటి, రోజుకు 700 మందికి పైగా ఆహారం అందే స్థాయికి చేరింది. చలికాలం, మండే ఎండలు, వర్షాలు ఏవీ కూడా అతని యజ్ఞాన్ని ఆపలేకపోయాయి. అతని సేవా గుణం చూసి అనేకమంది సహాయకులు చేరారు. అతని పేరు హరఖ్‌చంద్‌ సావ్లా.. ఒక సామాన్యుడు, అసామాన్య సేవతో దేవుడిలా మారాడు.

సేవలో ఒక అడుగు ముందుకు
ఆహారంతో ఆగకుండా హరఖ్‌చంద్‌ రోగులకు ఉచిత మందులు అందించేందుకు ఒక మందుల బ్యాంకును ప్రారంభించాడు. ముగ్గురు ఫార్మసిస్టులు, ముగ్గురు డాక్టర్లు, ఎందరో సామాజిక కార్యకర్తలతో ఈ సేవ కొనసాగుతోంది. క్యాన్సర్‌తో బాధపడే పిల్లల కోసం ‘టాయ్‌ బ్యాంకు‘ను కూడా స్థాపించాడు. అతను స్థాపించిన ‘జీవన్‌ జ్యోత్‌‘ ట్రస్ట్‌ ఇప్పుడు 60 కంటే ఎక్కువ సామాజిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

57 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం
ఇప్పుడు 57 ఏళ్ల వయసులోనూ హరఖ్‌చంద్‌ సావ్లా తన సేవలో అదే ఉత్సాహంతో పని చేస్తున్నాడు. 27 సంవత్సరాలలో 10–12 లక్షల మంది క్యాన్సర్‌ రోగులకు, వారి కుటుంబాలకు ఆహారం అందించిన సావ్లా గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 24 ఏళ్లు క్రికెట్‌ ఆడిన సచిన్‌ టెండూల్కర్‌ను కోట్లాది మంది దేవుడిగా కొలుస్తారు. కానీ హరఖ్‌చంద్‌ సావ్లా పేరు కూడా ఎందరికో తెలియదు. దేశంలో వేలు, లక్షల కోట్ల సంపద పోగేసుకున్న పెద్ద మనషులు చాలామంది ఉన్నారు. ముఖేష్‌ అంబానీ, అదానీ వంటి వారు దేశంలోని వనరులు, ప్రజల అవసరాలను ఉపయోగించుకుని లక్షల కోట్లు సంపాదించారు. వారు తలచుకుంటే ఇలాంటి సేవలు ఎన్నో చేయొచ్చు. కానీ అందుకు వారికి మనసు రాదు. వారి కంటె ఎంతో చిన్న స్థాయి వ్యక్తి అయినా లక్షల మందికి సేవ చేస్తూ సావ్లా నిజమైన కుబేరుడిగా మారాడు.

దేవుడు ఆలయాల్లో కాదు, మనుషుల్లో ఉన్నాడు
దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే కోట్లాది భక్తులు అక్కడ దేవుడిని వెతుకుతారు. కానీ నిజమైన దేవుడు మన చుట్టూ, మనలాంటి మనుషుల రూపంలో ఉన్నాడని హరఖ్‌చంద్‌ సావ్లా చూపించాడు. హరఖ్‌చంద్‌ సావ్లా ఒక సామాన్య మనిషి కాదు. అతను ఒక జీవన జ్యోతి, ఆశలు కోల్పోయిన వారికి ఆధారం. అతని సేవాతత్పరతకు వందల కోట్ల సలామ్‌లు.

TOP STORIES