Andhrabeats

అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు

Chandrababu plot in Amaravati

నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండవసారి పనిచేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆయన ఏపీలో సొంతిల్లు సమకూర్చుకోలేదు. అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కి చెందిన అతిథి గృహాన్ని తన నివాసంగా మార్చుకుని ఏడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీనిపై చాలా విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీలో ఇల్లు కట్టుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

ఇటీవల అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన ఆయన కుటుంబ సభ్యులు ఎట్టకేలకు వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతులది. రాజధాని భూ సకమీరణ కింద వారు ప్రభుత్వానికి ఇవ్వగా ప్రభుత్వం తిరిగి వారికి ప్లాట్లు ఇచ్చింది. ఈ మూడు ప్లాట్లు కలిపి చంద్రబాబు కొనుగోలు చేశారు. ఈ మూడు ప్లాట్ల విస్తీర్ణం 25 వేల చదరపు గజాలు. అంటే 5 ఎకరాలు. రాజధానిలో నిర్మించబోయే ఈ–6 రోడ్డుకు ఆనుకుని ఇది ఉంటుంది. ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్డు కూడా ఉంది.

ప్రస్తుతం ఈ స్థలం బోసిగా ఉన్నా మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం చూస్తే అత్యంత ప్రైమ్‌ ఏరియా. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు ఈ ప్లాట్‌ చుట్టుపక్కలే ఉంటాయి.

ఈ స్థలంలోని కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని గార్డెన్, భద్రతా సిబ్బంది గదులు, వాహనాల పార్కింగ్‌ వంటి వాటికి వినియోగించాలని భావిస్తున్నారట. త్వరలోనే అక్కడ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేయనున్నట్లు స్వయంగా చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని గతంలో చంద్రబాబు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని విశాఖకు తరలించేందుకు సిద్ధమవడంతో అమరావతి నిర్మాణం ప్రశ్నార్థకమైంది. కోర్టు కేసులు రకరకాల కారణాలతో జగన్‌ రాజధానిని విశాఖకు తరలించలేకపోయారు. ఈలోపు 2024 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంది.

ప్రస్తుతం రాజధాని నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. గతంలో ఆగిపోయిన నిర్మాణాలకు మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ సన్నాహాలు చేస్తున్నారు. శాశ్వత భవనాలకు మూడేళ్లలో పూర్తి చేస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా తన నివాసాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కొనుగోలు చేశారు.

చంద్రబాబుకు ప్రస్తుతం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో సొంతిల్లు ఉంది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవనాన్ని అత్యంత ఆధునికంగా నిర్మించారు. ఆయన కుటుంబం ప్రస్తుతం అక్కడే నివసిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అక్కడే ఉండేవారు. వారానికోసారి ఏపీకి వచ్చి వెళ్లేవారు. కుప్పంలోనూ చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి స్థలం కొనుగోలు చేశారు. ఎన్నికలకు ముందే ఆ స్థలంలో ఇల్లు కట్టాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు దాని కంటె ముందు అమరావతిలో ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధమయ్యారు.

TOP STORIES