Andhrabeats

చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. తన డిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ చెప్పినట్లు సమాచారం. వీటితో పాటు సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపై కూడా ఇరువురి మధ్య జరిగినట్లు తెలిసింది

ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, తదితరులను కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనపై కూడా చంద్రబాబుకు పవన్ వివరించనున్నారు. అలాగే కాకినాడలో పీడీఎస్ అక్రమ రవాణా, కోట్ల రూపాయల మేర ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ఇరువురి మధ్య చర్చకు రానుంది. రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా సీఎంతో పవన్ చర్చించే అవకాశం ఉంది. అలాగే ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కూడా చర్చ జరుగనుంది. బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌కు సీటు ఖారారు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో సీటును జనసేనకు ఇవ్వడమా లేక.. టీడీపీ నుంచి మరొకరి ఛాన్స్‌ ఉందా అనేదానిపై ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతోంది.

అయితే జనసేన నుంచి నాగబాబు రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తారా అనే దానిపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే అదానీ అంశం కూడా చంద్రబాబు, పవన్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చకు రానున్నట్లు సమాచారం. అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే మూడు లిస్టులు విడుదలయ్యాయి. నాలుగో లిస్టును కూడా టీడీపీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి నామినేటెడ్ పదవులు ఇవరెవరికి ఇవ్వాలనే దానిపై ఈరోజు చర్చలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి ఏపీ కేబినెట్ భేటీపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు మృతిపై పవన్ స్పందించినప్పటికీ ఇప్పుడు స్వయంగా సీఎంను కలిసి పవన్ సంతాపం తెలుపనున్నట్లు తెలుస్తోంది.

 

TOP STORIES