Andhrabeats

బన్నీ విశ్వరూపం : సుకుమార్ సూపర్ నారేషన్ – పుష్ప2 నిజంగా ది రూలే

2021లో పుష్ప ది రైజ్ తెచ్చిన ఊపును దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ గత మూడేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పుష్పరాజ్ పాత్రలో దేశమంతా కూడా ఓన్ చేసేసుకుంది. దీనికి కారణం ముమ్మాటికి సుకుమార్ రైటింగ్స్ ప్రేక్షకులకు ఇచ్చిన పుష్పరాజ్ అనే డ్రగ్. ఇప్పుడు అదే ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తూ పుష్ప ది రూల్ తయారయింది.

మూడేళ్లుగా ఈ సినిమాపై వచ్చిన కిక్ అంతా అంతా కాదు. పుష్ప2 సినిమాకి ఉండే అతి పెద్ద సవాలు.. అంచనాలను అందుకోవడం. సినిమాలో కొన్ని సీన్లు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నా కూడా ఎమోషనల్ గా హై ఎండ్ సీక్వెన్స్ ఉండటంవల్ల దర్శకుడు సుకుమార్ నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ఊపిరి సలపనివ్వని ఎలివేషన్ సీన్లు.. ఉర్రూతలూగించే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు దర్శకుడు. కథ పలుచనవ్వడం ఒకింత నిరాశపరిచినా మాస్ కు పూనకాలు తెప్పించే ఎపిసోడ్ల వల్ల పుష్ప ది రూల్ పక్కా పైసా వసూల్ సినిమాగా తయారైంది.

ఎప్పుడూ తన లాజిక్కులతో ఆకట్టుకునే లెక్కల మాస్టారు దర్శకుడు సుకుమార్ ఈసారి బోయపాటి, ప్రశాంత్ నీల్ తరహాలో హీరో ఎలివేషన్స్ మీద ఆధారపడటం నాలాంటి సుకుమార్ అభిమానులకు కొంత బాధగా ఉన్నా సరే మాస్ ప్రేక్షకులకు మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ అని సరిపెట్టుకున్నా సన్నివేశాలను ఒక గమ్మత్తయిన ముగింపుతో డీల్ చేయటం సుకుమార్ రైటింగ్స్ కు కొంత కలిసి వచ్చింది. ఓవరాల్ గా పుష్ప 2 ది రూల్ ఊర మాస్ ఎపిసోడ్లతో కూడిన ప్యాకేజీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ అద్బుతంగా ప్రతీ ఎపిసోడ్‌లోను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో చేసిన డాన్స్, ఫైట్స్ అమ్మోరి శివతాండవంలా కనిపిస్తాయి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లో అల్లువారబ్బాయి ఉద్వేగానికి గురిచేస్తాడు. అలాగే శ్రీవల్లిగా రష్మిక మందన్న కొన్ని సీన్లలో మెప్పించింది. శ్రీలీల స్సెషల్ సాంగ్‌లో మెరుపుతీగలా మెరిసింది కానీ ఎప్పుడూ సుకుమార్ సినిమాలలో ఉండే ఐటమ్ సాంగ్ లా ఆ పాట లేదు. అంతెందుకు పుష్పలో సమంత పాటే బాగుంటుంది. షెకావత్‌గా ఫాహద్ ఫాజిల్ ఎప్పటిలానే తన మార్క్ చూపించారు. అనసూయ, సునీల్, జగపతి బాబు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఉన్నంతలో రావు రమేష్, బ్రహ్మాజీ ఫర్వాలేదనిపిస్తారు.

మొత్తంగా చూస్తే అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ముందు అందరూ తేలిపోయారు. ఇక సాంకేతిక నిపుణులు గురించి ప్రస్తావించుకుంటే ముందుగా దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌ల్లో టైటిల్ సాంగ్ బాగుంది. సామ్ సీఎస్ బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. సినిమాకి టెక్నికల్ టీమ్స్ అన్ని చాలా ప్లస్ అయ్యాయి. సుకుమార్ మూడేళ్లు సమయం తీసుకున్నా మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి. కొన్ని షాట్స్ అయితే వావ్ అనిపిస్తాయి. చివరగా పుష్ప 2 ది రూల్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఐకాన్ స్టార్ ఆడించిన రాంపేజ్ అని గర్వంగా చెప్పొచ్చు.

– త్రినాధరావు గరగ
(జర్నలిస్టు)

TOP STORIES