విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 11 వేల 498 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్ 1ఏ, 1బి లను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. దీనికి రూ.11,009 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొదటి దశ కారిడార్ 1ఏ, 1బిల భూసేకరణకు రూ.1152 కోట్ల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. ఇక రెండో దశలో నిర్మించే మూడో కారిడార్‌ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు.
విజయవాడ, విశాఖ మెట్రోరైల్ డీపీఆర్‌లను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.