Andhrabeats

10 నెలల తర్వాత ముత్యాలరాజుకి పోస్టింగ్‌

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన నలుగురు ఐఏఎస్‌ అధికారులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. 10 నెలలపాటు వారిని వెయిటింగ్‌లో ఉంచి ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. రేవు ముత్యాలరాజు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేయడంతో ఆయన వైసీపీ ముద్ర వేశారు. ఆ కారణంగానే పోస్టింగ్‌ ఇవ్వలేదు. దాదాపు 10 నెలలపాటు ఆయన్ను జీఏడీలోనే ఖాళీగా ఉంచింది. అయితే ఆయన రకరకాలుగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలకు సిఫారసు చేయించుకోవడంతో ఎట్టకేలకు ఆదివారం ఆయనకు పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌కి కమిషనర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఆ పోస్టును మహ్మద్‌ దివాన్‌ మైదీన్‌ అదనంగా నిర్వహిస్తున్నారు. ఆయన్ను రిలీవ్‌ చేసి ముత్యాలరాజుకి పోస్టింగ్‌ ఇచ్చారు. ముత్యాలరాజు 2007 బ్యాచ్‌కి ఐఏఎస్‌ అధికారి. గతంలో నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. కానీ రాజకీయ కారణాలతో ఆయన 10 నెలలు పోస్టింగ్‌ కోసం వేచి ఉండాల్సివచ్చింది.
గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మరో ఐఏఎస్‌ అధికారి మాధవీలతకు సైతం సుదీర్ఘ వెయిటింగ్‌ తర్వాత పోస్టింగ్‌ లభించింది. ఆమెను రైతు బజార్ల సీఈఓగా నియమించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆమె కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆమెను పక్కన పెట్టి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇప్పుడు చివరికి పోస్టింగ్‌ ఇచ్చింది. వెయిటింగ్‌లో ఉన్న మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు గౌతమికి గిరిజన గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా, కోతమాసు దినేష్‌ కుమార్‌ను ఆయుష్‌ డైరెక్టర్‌గా నియమించారు. డాక్టర్‌ నీలకంఠారెడ్డిని ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఎండీగా నియమించారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్‌ సాధించిన నీలకంఠారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పారు. అప్పట్లో వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి ఓఎస్‌డీగా పనిచేశారు. ఈ సమయంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.

TOP STORIES