సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 43వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆ వివరాలను వెల్లడించారు.
ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్టింగులకు సంబంధించి రూ.24 వేల 276 కోట్ల పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. కొత్త అసెంబ్లీని 103 ఎకరాల్లోని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి అమరావతి సిటీ మొత్తం చూసేలా దీని డిజైన్ రూపొందించారు.
హైకోర్టును 20 లక్షల 32 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు. హైకోర్టు ఎత్తు 55 మీటర్ల మేర నిర్మాణానికి రూ 1048 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇక GAD టవర్, HOD టవర్లు మొత్తం ఐదు నిర్మిస్తున్నారు. ఇవన్నీ కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఐదు టవర్లకు రూ.4,608 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించారు.
డిసెంబర్ నెలాఖరుకు దాదాపు అన్ని టెండర్లు ఖరారు అవుతాయని మంత్రి నారాయణ చెప్పారు. జనవరి నుండి రాజధాని నిర్మాణ పనులు పూర్తిస్ధాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన అథారిటీ సమావేశాల్లో రూ. 45 వేల 249 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు.
మొత్తం రాజధాని నిర్మాణానికి రూ. 62 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. 2017-18లో పిలిచిన టెండర్లకు పనులు మొదలు పెట్టకపోవడంతో అప్పటికీ, ఇప్పటికీ ఎస్ఓఆర్ రేట్లు మారాయని నారాయణ స్పష్టం చేశారు. ఈ రేట్లను సీఆర్డీఏ నిర్ణయించలేదని ఇంజినీర్ల కమిటీ ఫైనల్ చేసిందని తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను రైతులతో మాట్లాడి తొలగిస్తామన్నారు.