ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా మరో నేషనల్ హైవేకు భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు ఉన్న జాతీయ రహదారి కారిడార్‌ను మరో జాతీయ రహదారికి కలుపుతూ 6 లేన్ల రహదారి నిర్మించేందుకు ఏకంగా రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివిధ నేషనల్ హైవేల విస్తరణకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. అనకాపల్లి – ఆనందపురం నేషనల్ హైవే 16 కారిడార్‌ను నేషనల్ హైవే 516సీ లోని షీలానగర్ జంక్షన్‌ను కలుపుతూ 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం కల్పించింది.
విశాఖ నగరానికి రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నారు. రూ.2013 కోట్లతో 50.8 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మిస్తున్నారు. ఢిల్లీకి చెందిన మెగా ఇంజినీరింగ్ డీబీఎల్ సంస్థ 98 శాతం పనులు పూర్తి చేసి మార్చి నెలాఖరు నాటికి జాతికి అంకితం చేయాలని భావిస్తోంది.
చెన్నయ్–కోల్‌కత్తా 16వ నెంబర్ జాతీయ రహదారి అనకాపల్లి, గాజువాక, ఎన్‌ఏడీ, విశాఖ నగరం మీదుగా వెళుతుంది. రవాణా, ప్రజా రవాణా తదితర వాహనాలు విశాఖ నగరం మీదుగా రాకపోకలు సాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం వరకూ జాతీయ రహదారిని కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టడంతో నగరానికి ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి వద్ద బైపాస్ నుంచి సబ్బవరం మీదుగా ఆనందపురం వద్ద జాతీయ రహదారికి చేరుకుంటాయి. దీంతో నగరానికి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. విశాఖ నగరానికి ఇది బైపాస్‌గా ఉపయోగపడనుంది. సబ్బవరం దగ్గర ఒక ఇంటర్ ఛేంజ్ సెక్షన్, పెందుర్తి దగ్గర మరొకటి ఏర్పాటు చేయడంతో విశాఖ నగరానికి వెళ్లేందుకు మరిన్ని దారులు ఏర్పడ్డాయి.
ఈ రహదారిపై మూడు టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేస్తున్నారు. క్లోజ్డ్ టోలింగ్ విధానం ద్వారా అనకాపల్లి వద్ద మర్రిపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాల్లో చేపట్టే టోల్‌ప్లాజాల వద్ద స్థానికులు టోల్‌ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సర్వీసు రోడ్డును ఏ టోల్‌ప్లాజాకు అనుసంధానం చేయకుండా వదిలేశారు. దీంతో స్థానికులు టోల్‌ప్లాజాకు వెళ్లాల్సిన పని లేకుండా సులభతరం కానుంది.
దాదాపు 35 గ్రామాలను తాకుతూ నిర్మిస్తున్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.2013 కోట్ల నిధులు వెచ్చిస్తోంది.