కోస్తా జాతీయ రహదారి – 216ని విస్తరించేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ రహదారి ఉండగా రెండు దశల్లో విస్తరించాలని యోచిస్తున్నారు. తొలి దశలో కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు 229 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రహదారిని ఆరు లైన్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేయాలని భావిస్తున్నారు. కాకినాడ పోర్టు ఇప్పటికే అభివృద్ధి చెందగా, మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టులో కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తా జాతీయ రహదారికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పోర్టులు ఇంకా వృద్ధిలోకి రావాలంటే జాతీయ రహదారి–16కి కోస్తా జాతీయ రహదారి అనుసంధానం చేయాల్సివుంటుంది.
కోస్తా రహదారి మచిలీపట్నం వద్ద మరో జాతీయ రహదారి–65తో అనుసంధానం అవుతోంది. అమరావతి రాజధాని ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్డులు ఎన్ హెచ్ 65కి అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా కోస్తా హైవేను అమరావతికి, హైదరాబాద్‌కి వెళ్లేలా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే కోస్తా జాతీయ రహదారి విస్తరణ డీపీఆర్ కోసం టెండర్లు పిలిచారు. ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీలు టెండరు దాఖలు చేయాలని జాతీయ రహదారుల సంస్థ కోరింది.