Andhrabeats

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌

ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్‌  ఎలన్‌ మస్క్‌ సూచించారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఆ ధోరణి మానేసి సంతోషంగా పిల్లల్ని కనడంపై దృష్టి పెట్టాలని మస్క్‌ సూచించారు. పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్‌లో జరిగిన ట్రంప్‌ అనుకూల ర్యాలీలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈఓ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన్ను పిల్లలను కనడం గురించి యువ తరానికి ఏమి సలహా ఇస్తారని అడిగారు. దానికి మస్క్‌ ‘పిల్లల్ని కనండి.. కుటుంబాన్ని పెంచుకోండి‘ అంటూ సమాధానమిచ్చారు. డబ్బు గురించి మరచిపోయి, త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. తన సలహాను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

మస్క్‌ ఇప్పటికే 11 మంది పిల్లలున్నారు. తన మాదిరిగానే అందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రజలను సంవత్సరాల తరబడి ప్రోత్సహిస్తున్నారు. అలా చేయకపోతే ప్రపంచ జనాభా పతనం అవుతుందని మస్క్‌ హెచ్చరిస్తున్నారు.

‘ప్రపంచంలో ఎక్కువ మందిని తల్లిదండ్రులు కావాలని ప్రోత్సహించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఆదర్శంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలి. తద్వారా జనాభా పెరుగుతుంది’’ అని గతంలో మస్క్‌ చెప్పారు. పిల్లలంటే ఖర్చు కాదని, ప్రజల జీవన విధానమని పేర్కొన్నారు.

ప్రస్తుత రోజుల్లో పిల్లల్ని కనేందుకు చాలామంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆర్థికపరమైన కారణాలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పాత రోజుల్లో పిల్లల్ని ఎక్కువ మందిని కనేవారు. కానీ, ప్రస్తుత ఆధునిక జీవితంలో పిల్లలపై దృష్టి పెట్టడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

కొంతమంది ఆర్థిక స్థోమత కారణంగా పిల్లల్ని పోషించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. జనాభా నియంత్రణ కారణంగా రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రపంచ బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ కూడా జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేశారు.

TOP STORIES