Andhrabeats

కేటీఆర్‌ బావమరిది ఫాం హౌస్‌లో పోలీసుల దాడులు

రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్‌ కాలనీలోని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ బావమరిదికి చెందిన రాజ్‌ పాకాల ఫాం హౌస్‌పై సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా మారింది. ఫాం హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఫారిన్‌ లిక్కర్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పార్టీలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్స్‌ టెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు కొకైన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. కొకైన్‌ తీసుకున్నట్లు తేలడంతో ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు స్వాధీనం చేసుకున్న ఫారిన్‌ లిక్కర్‌ను పోలీసులు ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. సెక్షన్‌ 34, ఎక్సైజ్‌ యాక్ట్‌ కింద మరో కేసు నమోదు చేశారు. ఈ ఫాం హౌస్‌లో జరిగిన పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు మొత్తం 35 మంది ఉన్నట్లు తెలిసింది. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. ప్లేయింగ్‌ కార్డ్స్, ప్లాస్టిక్‌ కైన్స్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

TOP STORIES