హైదరాబాద్‌లో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్‌రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి కోసం జేసీ కుటుంబానికి, అద్దెకున్న వారికి వివాదం నడుస్తోంది. దివాకర్‌రెడ్డి తనకు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటిని సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్‌కు అద్దెకు ఇచ్చారు. అయితే సాత్విక్ అదే ఇంటిని జేసీకి తెలియకుండా వేరొకరికి అద్దెకు ఇచ్చారు.
తాజాగా అద్దెకు తీసుకున్న వ్యక్తులు జేసీ ఇంటిని కూల్చివేసి వేరే నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి, ఆయన మేనేజర్ జగదీష్‌లు వారిని ప్రశ్నించగా రాజీవ్ సాల్మన్ అనే వ్యక్తి, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి, మేనేజర్ జగదీశ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఇంటినే కూల్చివేయడం, రాజకీయ కురువృద్ధుడైన జేసీని బెదిరించడం సంచలనం రేపుతోంది.