Andhrabeats

మన పర్యాటకుల గమ్యం.. ఒమన్‌!

 భారతీయ పర్యాటకులు తాజాగా ఒమన్‌ దేశానికి క్యూ కడుతున్నారు. ఆ దేశంలోని సుందర పర్వతాలు, సహజ సముద్ర తీరం, సాహస క్రీడలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల్లో ఖతార్‌ను వెనక్కి నెట్టి భారతీయులు ఒమన్‌కే ఓటేస్తున్నారు. 2023లో ఏకంగా 70 శాతానికి పైనే భారతీయుల పర్యటనలు పెరగడం విశేషం. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే ఏకంగా 15 శాతం పర్యాటకులు వృద్ధి చెందారు. దీంతో భారతీయుల అగ్రశ్రేణి పర్యాటక దేశాల్లో ఒమన్ చేరింది. భారతీయులకు ఒమన్‌ గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ దేశాలను మించిన అతిపెద్ద పర్యాటక మార్కెట్‌గా మారిపోయింది. గతేడాది ఒమన్‌ను 40 లక్షల మంది సందర్శిస్తే.. వారిలో ఒక్క మన భారత్‌ నుంచే  6.25 లక్షలున్నారు. యూఎస్‌, స్కెంజన్‌ వీసాలు కలిగిన భారతీయులకు ఒమన్‌ వీసా ఆన్‌ ఎరైవల్‌ సౌలభ్యం కూడా కల్పిస్తోంది.

ఫిలడెల్ఫియాకు కీలకం
యూఎస్‌లోని ఫిలడెల్ఫియా పర్యాటకంలోనూ భారత్‌ కీలకంగా మారింది. 2023లో ఫిలడెల్ఫియాను సందర్శించిన వారిలో భారత్‌ నుంచి 17 శాతం వృద్ధి నమోదైంది. దీంతో ఫిలడెల్ఫియాకు అతిపెద్ద అంతర్జాతీయ పర్యాటక మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. ఫిలడెల్ఫియాలో విద్య, వైద్య పర్యాటకం భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అక్కడి వారసత్వ కళలు, పన్ను రహిత షాపింగ్‌, మ్యూజియాలు, విశాల ఉద్యాన వనాలు భారతీయులను సందర్శించేలా చేస్తు‍న్నాయి.

మల్దీవుల స్వాగతం  
ఒకప్పుడు మాల్దీవులు మొత్తం భారతీయ పర్యాటకులతోనే నిండిపోయేది. ఇటీవల మాల్దీవులు, భారత్‌కు మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో దానిని సందర్శించే భారతీయులు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో మాల్దీవుల పర్యాటకం ఒక్కసారిగా కుదేలైంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం చూపుతోంది. ఈ క్రమంలోనే మరోసారి తమ పర్యాటకంలో భారతీయులు భాగం కావాలని మాల్దీవులు కోరుకుంటోంది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 40 శాతం భారతీయ పర్యాటకం మాల్దీవుల్లో క్షీణించింది. వీటితో పాటు థాయిలాండ్, ఇండోనేషియా, బాలి, సింగపూర్, మలేషియా, యునైటెడ్ కింగ్‌డమ్, యూఏఈ, వియత్నాం, కంబోడియా వంటి దేశాలు భారతీయ పర్యాటకులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఆ విధంగా ప్రపంచ పర్యాటకంలో భారత్‌ అతి పెద్ద ఆర్థిక వనరుగా నిలుస్తోంది.

TOP STORIES