Andhrabeats

మొక్కలను తాకితే ఒత్తిడి తగ్గుతుంది

 మనం పచ్చదనం మధ్య కూర్చున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్లల్లోని గార్డెన్ల మధ్య గడిపినా హాయిగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యంలో ఉన్న మహత్యం అదే. దాని వెనుక నిజమైన సైన్స్‌ ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే గ్రీన్‌ థెరపీ అని అంటున్నారు. చేతులతో మొక్కలను తాకడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. గార్డెన్లు, పార్కులు, అడవులే కాదు మన ఇంట్లో పెరిగే ఒక మొక్కను చూసుకుంటున్నా ఆ అనుభూతి ఎంతో హాయినిస్తుంది. అందుకే ఇళ్లు, కార్యాలయాల్లోనూ అందం, ప్రశాంతత కోసం మొక్కలు పెండడం అలవాటుగా మారింది. మన ఇళ్లల్లో మనతోపాటు ఉండే ఆకుపచ్చని నేస్తాలు మనస్సుకి, శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయి. చాలాచోట్ల పార్కులు ఏర్పాటు చేసిందీ ఆహ్లాదం కోసమే. ఇప్పుడు  బోర్‌ కొట్టినా, మనస్సు బాగోకపోయినా, పని ఒత్తిడి ఎక్కువైనా చాలామంది నేచర్‌ వాక్స్‌కి వెళ్లడం, అడవుల్లోకి వెళ్లి సేద తీరడం, సుదూరంలోని ప్రకృతి సౌందర్యాలను చూడడానికి, అక్కడ గడపడానికి సమయం కేటాయిస్తున్నారు.

ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయిలు తగ్గుతాయి
  ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒత్తిడి చాలా ప్రభావితం చేస్తోంది. ఇది శరీరంతోపాటు మనస్సును కూడా దెబ్బతీస్తుంది. దీన్ని ఎదుర్కొనే సులభమైన మార్గం గ్రీన్‌ థెరపీ అని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రకృతితో మళ్లీ అనుసంధానమవ్వాలి. ఒట్టి చేతులతో పూలను లేదా మొక్కలను తాకడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని తేలింది. సెరోటోనిన్, ఎండార్ఫిన్‌ వంటి మూడ్‌ బూస్టింగ్‌ హార్మోన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించే ఫైటోన్‌సైడ్‌లను మొక్కలు విడుదల చేస్తాయి. అవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అమెరికాలోని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌ జరిపిన ఒక అధ్యయనంలో మొక్కలను తాకడానికి గడిపిన సమయంలో వ్యక్తులు మనశ్శాంతిని అనుభవిస్తున్నారని కనుగొన్నారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మొక్కలు మధ్యకు వెళ్లి వాటిని తాకడం, వాటికున్న పూలను తడమడం లేదా చూడడం ద్వారా మానసిక స్థితి మారుతుంది. ఆ సమయంలో మన మూడ్‌ ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా ఒత్తిడి నుంచి బయటపడి మామూలు స్థాయికి తిరిగి రావచ్చని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడిని తగ్గించే 5 మొక్కలు
  లావెండర్‌ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటి పువ్వుల సువాసన ఆందోళనను దూరం చేస్తుంది. నిద్రలేమిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో వాటిని అలంకరణగా పెట్టినా వాటి వల్ల మన మూడ్‌ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. మల్లె మొక్కలు, వాటి పువ్వుల సువాసలు ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరచడానికి దోహదపడతాయి. పాము మొక్కలు (చాగనార) గాలిని శుద్ధి చేసే విషపూరిత కాలుష్య కారకాలను తగ్గిస్తాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచి ఒత్తిడి లేని వాతావరణానికి ఏర్పర్చడానికి ఉపయోగపడతాయి. తులసి మొక్క (బాసిల్‌ ఇండియన్‌) శ్వాసలో ఇబ్బందులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని పునరుద్ధరించడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది. కలబంద మొక్కలోని ఔషధ గుణాల వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు ఒత్తిడితో సతమతమవుతున్న వారిని కొద్దిరోజులు పనికి విరామం ఇచ్చి ప్రకృతిలో గడపమని చెబుతున్నారు వైద్యులు. పిక్‌నిక్‌లకు వెళ్లడం, అడవుల్లో చెట్లు, సెలయేళ్ల మధ్య తిరగడం, ఇళ్లల్లోనే మొక్కలు పెంచడం, మొక్కలు నాటి వాటి ఎదుగుదలను చూడడం, పవ్వులు పూయడాన్ని ఆస్వాదించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

TOP STORIES