Andhrabeats

2025లో జనగణన.. 2028లో పునర్విభజన

జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి.

ప్రతి పది సంవత్సరాలకోసారి ఆనవాయితీగా నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. రాష్ట్రాల వారీగా, జాతీయ స్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు పరచడానికి ఈ జనగణనే కీలకం. కొవిడ్‌ సంక్షోభం 2021 సెన్సస్‌కు ప్రతిబంధకంగా మారింది. తర్వాత ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొద్ది నెలల క్రితం మాట్లాడుతూ ‘తగిన సమయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాం. దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో నేను ప్రకటిస్తాను. ఈసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఈ సర్వే ఉంటుంది‘ అని వెల్లడించారు.

గత ఏడాది ఏప్రిల్‌ లో చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా ఆవిర్భవించినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్ల కన్నా భారతీయ జనాభా రెండు కోట్లు అధికమన్నది ఒక అంచనాయే తప్ప కచ్చితమైన లెక్కలు లేవు. వేర్వేరు పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న నీతి ఆయోగ్‌ లెక్కలు వెల్లడించాయి. సరైన గణాంకాలు లేకుండా ఈ ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే జనగణన ఒక కొలిక్కి వచ్చేదాకా నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణా ఆగాల్సిందే.

TOP STORIES