Andhrabeats

3 నెలల్లోనే చంద్రబాబు గ్రాఫ్‌ ఢమాల్‌

  మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్‌ అనూహ్యంగా పడిపోయింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టమైంది. ఇండియా టుడే ఇటీవల దేశంలోని పాపులర్‌ సీఎంలు ఎవరనే దానిపై ఒక సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో సర్వే చేసింది. అందులోభాగంగా ఏపీలోనూ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కేవలం 44 శాతం మంది మాత్రమే చంద్రబాబుకు మద్ధతు తెలిపారు. మిగిలిన 56 శాతం మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 56 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేయడంతో ఆయన చెప్పిన మాటల్ని జనం నమ్మారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజల తలరాతలు మార్చేస్తానని, సంపద సృష్టిస్తానని అలవికాని హామీలు ఇచ్చారు. వాటిని నమ్మి నిజంగా చంద్రబాబు అవన్నీ ఇస్తారనే భ్రమతో ఓట్లేశారు. దీంతో ఎన్డీయే కూటమికి 56 శాతం ఓట్లు రావడంతో 164 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి.

బాబు మోసాన్ని తెలుసుకుంటున్న జనం
  కానీ మూడు నెలలు తిరక్కుండానే ప్రజలు చంద్రబాబు మోసాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇండియా టుడే సర్వేలో ఆయన గ్రాఫ్‌ ఒక్కసారిగా 12 శాతానికి పడిపోయింది. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయికి పడిపోవడం అంటే వ్యతిరేకత ఎంత వేగంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్క దాన్ని కూడా అమలు చేయకపోవడంతో ఆయా వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల కంటె ఎక్కువగా సంక్షేమం ఇస్తానని ప్రకటించినా ఇంతవరకు ఆ విషయం గురించే మాట్లాడడం మానేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఐదు అంశాలపై తొలి సంతకాలు చేసినా ఏ ఒక్కటీ అమల్లోకి రాలేదు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తానని తొలి సంతకం చేసినా ఇప్పటివరకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు.

హామీలను అటకెక్కించడంతో ఆగ్రహం
  యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఇస్తానని అదే పనిగా చెప్పి అధికారంలోకి వచ్చి ఆ మాటే మరచిపోయారు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని చెప్పి విద్యా సంవత్సరం మొదలైనా ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడంలేదు. ప్రతి రైతుకి ఏడా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తానని ఇవ్వలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి ఇంటికి 3 గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీల గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. ఎన్నికలకు ముందు ఇవన్నీ ఇస్తానని ఊదరగొట్టి ఇప్పుడు ఆ మాటే ఎత్తకపోవడంతో ప్రజలకు చంద్రబాబు మోసం అర్థమైపోయింది. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉంటే ఈపాటికి అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాల కింద ఎంత మొత్తం వచ్చేదో చర్చించుకుంటున్నారు. ప్రజలకు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగడం, ఆ పార్టీ కార్యకర్తలు, నేతలను నడిరోడ్డుపై చంపడం, కొట్టడం, గ్రామాల నుంచి తరిమేయడం, కేసులు పెట్టడం ద్వారా 3 నెలల్లోనే రాష్ట్రంలో భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకమైన స్థితిలో వైఎస్‌ జగన్‌ పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య తేడా ప్రజలకు అవగతమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలోనే చంద్రబాబు గ్రాఫ్‌ కేవలం అతి తక్కువ వ్యవధిలోనే దిగజారిపోయినట్లు ఇండియా టుడే సర్వేలో తేటతెల్లమైంది.

TOP STORIES