Andhrabeats

తంగలాన్‌.. ఒక సాహసం– ఒక అద్భుతం     – కటిక దరిద్రుల ఆకలి పోరాటం

వాళ్ళు– పేదవాళ్ళు.. కూటికి గతి లేని వాళ్ళు.. మూల వాసులు.. దళితులు.. ఎండుగడ్డి పోచలు.. మొలకు గోచీల వాళ్ళు… భార్యలతో, బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ… బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురు, కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత  సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఒక ఘాతుకాన్ని.. అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు – తంగలాన్‌!

  కొన్ని నిజ జీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం– తంగలాన్‌.

  సర్పట్ట  చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు తంగలాన్‌! వీటిని తీసిన పారంజిత్‌ అనేవాడు మామూలు మనిషి కాదు. మహా దర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రీకుడు. మన కాలం వీరుడు. ‘నేను అంబేద్కరిస్ట్‌ని’ అని ప్రకటించుకున్న రంజిత్, రొటీన్‌ రొడ్డ కొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థం వుంది. అతని ఆగ్రహానికో పద్ధతి వుంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్‌ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్‌ ప్లాన్‌ మాత్రమే కాదు. అదొక తపస్సు. చెక్కు చెదరని నిబద్ధత. ఒక సూపర్‌ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!

కోలార్‌ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ ఒళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని కట్టిపడేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్‌ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ, ముందు మొనదేలిన ఈటెలూ…

బంగారం ఒక తీరని దాహం. దురాశ.
ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి!
ఇలాంటి ఒక మానవ మహా విషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్‌ గా చెప్పాలంటే, కమర్షియల్‌ స్కీమ్‌తోనే కొట్టాలి. బలమైన బ్లాక్‌ బస్టర్‌ టెక్నిక్‌తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పారంజిత్‌ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన  ఒక చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు.

‘చియాన్‌’విక్రమ్‌ ఒక మార్మిక శక్తిగా మారి ముందుండి ఈ సినిమాని నడిపించాడు.

‘సేతు’ చిత్రంలో చియాన్‌ పేరుతో విక్రమ్‌ పాపులర్‌ అయ్యాడు. అదే తెలుగులో శేషు. హిందీలో తేరే నామ్‌. విక్రమ్‌ దిక్కులేని దరిద్రుడిగా, ధైర్యవంతుడిగా, పేదరికానికి పుట్టిన మానవ మృగంలా, ఇంగితం వున్న మూలవాసుల నాయకుడిగా, బానిస బంధనాల్ని తెంచుకున్న విముక్తి పోరాట యోధుడిగా ప్రతి ఒక్కర్నీ మెప్పించాడు. పాత్రలో అంత సహజంగా ఇమిడిపోవడంలో వున్న శ్రమ, కళ పట్ల అతనికి వున్న అపారమైన ప్రేమ వెలకట్టలేనివి.

విక్రమ్‌ భార్యగా, ముగ్గురు బిడ్డల తల్లిగా, కొద్దిపాటి ఆనందాన్ని, పెను విషాదాన్నీ అలవోకగా పండించిన మలయాళ నటి పార్వతీ తిరువొత్తుని మనం ఎప్పటికీ మరచిపోలేం.
నల్లగా నిగనిగలాడిన మరో పేదరాలు, తమిళ నటి ప్రీతీ కరణ్‌ పాత్ర ఔచిత్యానికి పర్యాయపదంగా మనసు దోచుకుంటుంది. ఆ అంటరాని మారుమూల పల్లెలో, వూసినా, దుమ్మెత్తిపోసినా చలనం లేని కటిక దరిద్రపు బతుకులు వాళ్ళవి.
ఆ గ్రామంలో ఏ ఆడదీ జాకెట్టు వేసుకోదు. బిడ్డల ఆకలి తీర్చడమే అలవికాని పని. అక్కడ జాకెట్లకీ, షోకులకీ ఆవ గింజంత అవకాశమూ లేని పాడుకాలం అది. ‘‘వొరేయ్‌ పనికిమాలినోడా, నాకో జాకెట్‌ తెచ్చిస్తావా?’’అని మొగుడు విక్రమ్‌ని అడుగుతుంది పార్వతి. ఒక పోరాటంలో గెలిచి, బ్రిటిష్‌ దొరల మెప్పు పొందిన తంగలాన్‌ బోలెడన్ని జాకెట్లు పట్టుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు చూడాలి పార్వతి బుగ్గల్లోంచి ఉబికి వచ్చే ఆనందం. ఆడాళ్ళందరూ జాకెట్లు వేసుకుని మురిసిపోతుంటారు.

అప్పుడు మొదలవుతుంది ఒక సెలబ్రేషన్‌ం ఒక బృందగానం, ఒక గిరిజన నృత్య కోలాహలం.
ఆ హొయలు.. ఆ తూగు.. ఆ జీవన సౌందర్యం పూలతీగలా మనల్ని చుట్టుకునే పరిమళం.

పార్వతీ, ప్రీతీ – ఇద్దరిదీ మనోహరమైన చిరునవ్వు. ఫోటోగ్రాఫరూ, పారంజిత్‌ ఏమైపోయారో గానీ, జనం మాత్రం పరవశించి చిత్తయి, చచ్చి సున్నమైపోతారు. దర్శకుడి మీద ఎంత గౌరవం కలిగిందంటే, వాళ్ళెవరికీ కొన్ని డజన్ల మంది ఆడవాళ్ళకి రవికెలు వుండవు కదా, ఐనా, ఒక్కసారి కూడా, ఒక్క స్త్రీని కూడా అశ్లీలంగా చూపించే పని చేయలేదు.

బుద్ధ జాతక కథల్లోని ‘హారతి’, ఈ సినిమాలో బంగారాన్ని, ప్రాణాలకు తెగించి రక్షించే వన దేవతగా వుంటుంది. ఆనాటి మూఢ నమ్మకాలకూ, భయాలకూ, అపోహలకూ ప్రతీకగా ఒక సర్రియలిస్ట్‌ నేరేటివ్‌ పవర్‌తో, గావు కేకలు పెట్టి, నెత్తురు కళ్ళజూసే గిరిజన దేవతగా మాళవికా మోహనన్‌ అనే గ్లామర్‌ స్టార్‌ మూలవాసుల్నీ, ప్రేక్షకుల్నీ భయకంపితుల్ని చేస్తుంది. ఇదో పవర్ఫుల్‌ క్రియేటివ్‌ టెక్నిక్‌.

తంగలాన్‌కి పీడకలలు వస్తుంటాయి. తాత చెప్పిన పురాతన గాథల్లోని ఆపదలూ, అప శకునాలూ అతన్ని వణికిస్తుంటాయి. చూసేవాళ్ళకి విభ్రాంతి కలిగేలా ఈ కలల్ని మేజికల్‌ రియలిజంలా ఒక మాయలా, మార్మికంగా చేసిన విజువల్‌ ప్రెజెంటేషన్‌– పారంజిత్‌కి మహా రచయిత గాబ్రియల్‌ గార్షియా మారంక్వజ్‌ పూనాడా అని అనిపిస్తుంది. ఇది సామాన్య ప్రేక్షకుడికి కనక్ట్‌ కావడం కష్టమే! ఎవర్ని ఎవరు చంపుతున్నారో తెలియని ఒక ఉన్మాదం లాంటి కేయాస్‌ని అద్భుతంగా చూపగలిగిన జీనియస్‌ రంజిత్‌. తంగలాన్‌లో కొన్ని లోపాలు వున్నాయని చెప్పవచ్చు. అయితే బాధితుల పక్షాన నిలిచిన పారంజిత్‌ కమిట్‌మెంట్‌ ముందు, సముద్ర కెరటాల్లా విరుచుకుపడిన సృజనాత్మక తిరుగుబాటు ముందు, చీకటిలో వెలిగించిన ఆశాదీపాల కాంతి ముందు అవి వెలవెలబోతాయి.

అడవిలో, కొండ దగ్గర చటుక్కున ఒక నెమలి ఎగిరి రెండు మూడుచోట్ల వాలుతుంది. అక్కడ బంగారం వుంటుందని అర్థమైపోతుంది. నెమళ్ళకి బంగారం ఎక్కడ వుందో పసిగట్టే శక్తి వుందో లేదో మనకి తెలీదు గానీ, చూడ్డానికి అదెంతో బావుంది. కొండల్లో నిక్షిప్తమై వున్న బంగారాన్ని కాపాడే విషసర్పాలు వందల్లో జరజరా పాకి వచ్చి దాడి చేస్తాయి. ఎగిరి దూకిన ఒక నల్లచిరుత హఠాత్తుగా వూడిపడుతుంది. మరోచోట కత్తివేటుకు కొండదేవత పొట్ట చీరుకుపోయి నెత్తురు ధారలై పారుతుంది. కొద్దిసేపటికి ఆ ప్రాంతం అంతా బంగారం మిలమిలా మెరుస్తుంది. ఇలాంటి మేజికల్‌ సన్నివేశాలు వూపిరి సలపనివ్వవు. టిప్పుసుల్తాన్‌ నిరాశతో వెనుతిరిగిన కొండల్లో, లోతైన బావుల్లో, ప్రాణాలకి తెగించి పోరాడినా చేతికి దొరకని బంగారం దళిత బహుజనుల చీకటి జీవితాన్ని మార్చివేసే ఆ పసిడి వెన్నెల కాంతిని వాళ్ళు చూడగలుగుతారా? ఆ అడివిబిడ్డల ఆకలి తీరుతుందా?

హృదయాన్ని కదిలించే సంగీతం మనల్ని కుర్చీలో కూర్చోనివ్వదు. కళాత్మకమైన ఫోటోగ్రఫీ మనశ్శాంతిని మిగల్చదు. బ్రాహ్మల మీదా, బ్రిటిష్‌ వాళ్ళ మీదా ఎండు గడ్డిపోచల్లాంటి, దరిద్రదేవత బిడ్డలు దళితులు  విజయం సాధించేదాకా పారంజిత్‌ ఊరుకోడు.

చరిత్ర కొంచెం తెలిసివుంటే ఈ సినిమా విలువ ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది.

శిస్తు కట్టలేదనే నెపంతో దళితుల భూముల్లో వాళ్ళనే కట్టు బానిసల్ని చేసి, వెట్టి చాకిరీ చేయించే రాక్షసత్వం మీద తిరుగుబాటే తంగలాన్‌. సాహసించి, తెగించి, ప్రాణాలు వొడ్డి పోరాడి తన నేల తల్లిని తాను సాధించుకుంటాడు. ఆధిపత్యం తలకెక్కిన దొరలు దిగివచ్చి ‘పత్రాలు’ యిచ్చేస్తారు.

వెండితెర నిండుగా పరుచుకున్న తన సొంత పొలంలో మట్టిపెళ్ళల మీద గుండె నిండిన సంతోషంతో విక్రమ్‌ వెల్లకిలా పడుకుంటాడు. సంగీతం మనల్ని వెన్నాడుతుంది. కళ్ళలో నీళ్ళు తిరిగే సన్నివేశం ఇది.

ఇది భూమి సమస్య. బతుకు సమస్య. మూలవాసులకు చావోరేవో తేల్చుకునే విషమ సమస్య. ఆ బాధని గుండెలవిసిపోయేలా చిత్రీకరించగలగటం ఈ దర్శకుడు సాధించిన విజయం. బంగారంతో పాటు చరిత్రనీ తవ్వి తీయగలిగాడు.

2024లో నిస్సందేహంగా ఉత్తమ జాతీయ చిత్రం ‘తంగలాన్‌’. మరో అరడజను అవార్డులు ఎలాగూ వస్తాయి. తప్పక చూడాల్సిన సినిమా

TOP STORIES