Andhrabeats

సినీ ప్రేక్షకులను మేమే చెడగొట్టాం– నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను రాకుండా తామే చెడగొట్టామని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ‘రేవు’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న
ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు.  సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదని, ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్‌ ఛాలెంజ్‌ అని ఆయన చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం దిల్‌ రాజు చేసిన వ్యాఖ్యలపై అటు ఇండస్ట్రీతో పాటు ఇటు సోషల్‌ మీడియా వేదికగానూ చర్చ జరుగుతోంది. కరోనా తర్వాత వందల చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. థియేట్రికల్‌ రన్‌ బాగున్న సినిమాలు కూడా ముందుగానే స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. సినిమా విడుదలకు ముందే ఓటీటీ సంస్థలతో చిత్ర బృందాలు చేసుకున్న ఒప్పందాల కారణంగా రాక తప్పని పరిస్థితి. ’సలార్, ’టిల్లు స్క్వేర్‌’, ’ది ఫ్యామిలీ స్టార్‌’ వంటి చిత్రాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా త్వరగా ఓటీటీ బాట పట్టాయి. ఈ ఏడాది ’హనుమాన్‌’, ’కల్కి 2898 ఏడీ’లు మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు కనీసం 50 రోజులు ఆగాయి.

ప్రేక్షకుడి వైపు నుంచి చూసినా.. థియేటర్‌కి వచ్చి సినిమా చూసే పరిస్థితులు నానాటికీ తగ్గిపోతున్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. ఇందుకు వారు చెప్పే ప్రధాన కారణాలు.. టికెట్‌ ధరలు, పార్కింగ్‌ వసూళ్లు, తినుబండారాల ధరలు వెరసి నలుగురున్న ఒక కుటుంబం సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ రూ.2 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

వాటిని నియంత్రిస్తే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడన్నది సామాన్యుడి మాటగా ఉంది.

మరోవైపు ఇతర చిత్ర పరిశ్రమలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ విషయంలో కచ్చితంగా ఉంటున్నాయి. కనీసం 50 రోజులు పూర్తయిన తర్వాతే ఓటీటీలో వచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర కథానాయకులకు సంబంధించిన ఏ సినిమా అయినా విడుదలైన తేదీ నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. మలయాళంలోనూ ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందనేది వేచిచూడాలి.

TOP STORIES