Andhrabeats

హరీష్ శంకర్ ఈసారి నిరాశపరిచాడు

బాలీవుడ్ నుంచి కథలు అరువు తెచ్చుకుని వాటికి తనదైన కామెడీ టచ్ ఇచ్చి మంచి కమర్షియల్ సినిమాలుగా మలిచే దర్శకుడిగా హరీష్ శంకర్ కు పేరుంది. ‘దబాంగ్’ను ‘గబ్బర్ సింగ్’గా.. ‘జిగర్ తాండ’ను ‘గద్దలకొండ గణేష్’గా అతను మలిచిన తీరు ప్రశంసనీయం. ఇప్పుడు హిందీ హిట్ ‘రైడ్’ను తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో  రీమేక్ చేసి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో  కథకు కమర్షియల్ టచ్ ఇస్తూ, వినోదాన్ని జోడించి కత్తి మీద సాములాంటి ఈ వ్యవహారంలో  సగమే పాసయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్..
దేశ చరిత్రలోనే ఆదాయపు పన్నుశాఖ చేసిన అతిపెద్ద ఐటీ దాడి ఆధారంగా తెరకెక్కిన రైడ్  సినిమా చాలా సీరియస్ గా ఉంటుంది. పూర్తిగా కథకే పరిమితమై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం కట్టిపడేస్తుంది. అదే మిస్టర్ బచ్చన్ విషయానికి వచ్చేసరికి ఫస్టాఫ్ అంతా పూర్తిస్థాయి వినోదం కనిపిస్తుంది. ఇక్కడ వరకు బానే ఉన్నా ద్వితీయార్థానికి వచ్చేసరికి జానర్ పూర్తిగా మారిపోతుంది. అదే ఈ సినిమాకు దెబ్బేసింది. సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం విలన్ ఇంటికే పరిమితమైపోతుంది. దీంతో కథ ముందుకు సాగుతున్న ఫీలింగ్ ఎక్కడా రాదు. దీనికితోడు జగపతిబాబు పాత్ర రాసుకున్న విధానం అస్సలు మెప్పించదు.ప్రారంభంలో సీరియస్ గా కనిపించిన విలన్ రానురాను కమెడియన్ గా మారిపోతాడు., హీరోను ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోతాడు. విలన్ నుంచి పెద్దగా సవాళ్లు ఎదురుకానప్పుడు హీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశం ఉండదు. ఈ సినిమాలో అదే జరిగింది. హిందీలో కీలకంగా మారిన సన్నివేశాలను తెలుగుకు వచ్చేసరికి మార్చేయడం కొంత ఇబ్బంది అనిపించింది.హిందీ సినిమా సంగీతం పట్ల విపరీతమైన ప్రేమ ఉన్న హరీష్ శంకర్ దాన్ని పదే పదే ప్రదర్శించడం ఒకదశ దాటాక బోర్ కొట్టేసింది. పైగా సినిమాలో ప్రతి క్యారెక్టరూ చివరికి విలన్ తో సహా బాలీవుడ్ మ్యూజిక్ అంటే పడి చచ్చిపోయే రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేసి పదే పదే హిందీ పాటలను ప్లే చేయించడం మ్యూజిక్ లవర్స్కు బాగానే ఉన్నా సగటు తెలుగు ఆడియన్స్ కి మింగుడు పడదు. అక్కడక్కడా చిరంజీవి, ఏఎన్ఆర్ సాంగ్స్ వాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే రవితేజ ఎనర్జీ గురించి ఎన్నిసార్లు రాసినా తక్కువే. బచ్చన్ గా తనవరకు వంక పెట్టలేని విధంగా ఉంది.  టైమింగ్ బాగా కుదిరింది. డాన్సుల్లో ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తుంది. భాగ్యశ్రీ బోర్సే అందం,అభినయం రెండూ బాగున్నాయి. స్వంత డబ్బింగ్ చెప్పకపోయి ఉంటే బాగుండేది. జగపతిబాబు అరుపుల్లో సౌండ్ ఎక్కువయ్యింది.కమెడియన్ సత్య చిన్న చిన్న జోకులతో అక్కడక్కడా బాగానే నవ్వించాడు.చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీనుల ఎపిసోడ్ సింకవ్వలేదు. మిగతా వారంతా ఓకే.సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ప్లస్ పాయింట్. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల ఎడిటింగ్ విభాగం పూర్తిగా చతికిలపడింది. అయనంకా బోస్ ఎప్పటి మాదిరిగానే విజువల్స్‌ను అద్బుతంగా తెరకెక్కించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ విషయానికి వస్తే.. రీరీకార్డింగ్ బాగుంది. టీజీ విశ్వప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు పీపుల్స్ మీడియా బ్యానర్‌కు తగినట్టే ఉన్నాయి.

ఓవరాల్ గా మిస్టర్ బచ్చన్ సినిమా ముక్కలు ముక్కలుగా చూస్తే బాగుంటుంది. మొత్తం కలిపి చూస్తే సహనానికి పరీక్ష పెడుతుంది

TOP STORIES