ఆర్టీసీ కార్గోలో కొరియర్ ఇచ్చిన ఖరీదైన చీర మిస్ అయింది. దాంతో పాటు ఉన్న అన్ని పార్శిళ్ళు వచ్చినా ఆ చీర పార్సిల్ మాత్రం గమ్యానికి రాలేదు. అది ఆర్టీసీ చైర్మన్ కోడలికి చెందిన ఖరీదైన చీర కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..!
నవంబర్ 6వ తేదిన వినుకొండ నుంచి తిరుపతికి ఆర్టీసీ అద్దె బస్సు వెళ్లింది. ఆ బస్సులోనే ఒంగోలులో పదహారు పార్శిళ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నెల్లూరు వరకు బుక్ అయి ఉన్నాయి. అయితే వాటిల్లో పదిహేను పార్శిళ్లు మాత్రమే కార్గో ఆఫీసులో ఉన్నాయి. మరొక పార్శిల్ కనిపించలేదు. దీంతో ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. చివరికి బస్సు డ్రైవరే ఆ పార్శిల్‌ను కార్గో ఆఫీసులో ఇవ్వలేదని తేల్చారు. అయితే ఇంకేముంది అతన్ని పట్టుకుని పార్శిల్ తీసుకోవచ్చుననేగా మీ డౌట్.. అందరూ అలాగే అనుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ డ్రైవర్ ఫోన్ స్విఛ్చాఫ్ చేశాడు. అద్దె బస్సు డ్రైవర్ కావడంతో అతన్ని పట్టుకోవడం కష్టంగా మారింది. ఇంతకీ ఆ పదహారో పార్శిల్‌లో ఏముందంటే..? అదొక ఖరీదైన చీర. ఎంతనకుంటున్నారా.. లక్ష రూపాయలు
లక్ష రూపాయల చీర మిస్ కావడంతో బుక్ చేసిన యజమాని ఆర్టీసీ కార్గో ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పార్శిల్ మిస్ అయిన విషయాన్ని ఒప్పుకుంటూనే దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతకీ ఆ చీర యజమాని ఎవరనుకుంటున్నారు. సాదాసీదా వ్యక్తులయితే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.. ఆ చీర యజమాని ఆర్టీసీ ఛైర్మన్ కోడలు. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది. వినుకొండ, ఒంగోలు, నెల్లూరు కార్గో సర్వీసుల్లోని ఉద్యోగులందరూ ఇప్పుడు ఆ ప్రైవేటు అద్దె బస్సు డ్రైవర్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ మహానుభావుడు ఎప్పుడు దొరుకుతాడో పార్శిల్ ఎప్పుడు చేతికొస్తుందోనని ఎదురు చూస్తున్నారు.