Andhrabeats

ఆర్టీసీ ఛైర్మన్‌గా దేవినేని ఉమ.. నామినేడెట్‌ పదవులు ఖరారు

  ఎన్డీయే కూటమిలో నామినేటెడ్‌ పదవులు ఖరారయినట్లు తెలుస్తోంది.  ఆగస్టు 15 తర్వాత ఈ పోస్టుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయనే దానిపై టీడీపీ, బీజేపీ, జనసేన పారీల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వీటిపై జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.
  రాష్ట్రంలో 90 వరకూ కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేస్తారని చెబుతున్నారు. మొదటి విడతలో 30 శాతం పదవులను ప్రకటించే అవకాశం ఉంది.
  నామినేటెడ్‌ పదవుల్లో టీటీడీ ఛైర్మన్‌ పదవి హాట్‌ సీట్‌గా ఉంది. దీనికోసం పెద్ద నేతలు గట్టిగా లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈ పదవికి టీవీ–5 ఓనర్‌ బీఆర్‌ నాయుడి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు టీడీపీ సీనియర్‌ నాయకుడు కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తున్నా బీఆర్‌ నాయుడికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
   ఇక టీటీడీ బోర్డు సభ్యులుగా తెలంగాణా నుంచి నర్శిరెడ్డి,  తిరునగరి జ్యోత్స ్న పేర్లు దాదాపు ఖరారయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ నుంచి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దినేష్‌ రెడ్డి, ఉత్తరాంధ్ర నుంచి కూన రవికుమార్, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

కీలకమైన ఆర్టీసీ చైర్మన్‌ పదవిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
  ఏపీఐఐసీ, పౌర సరఫరాల శాఖ, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిన్షన్‌ లకు చైర్మన్లు ఖరారైనట్లు సమాచారం. ప్రొద్దుటూరు టికెట్‌ను త్యాగం చేసిన ప్రవీణ్‌ కుమార్‌రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ చైర్మన్‌ పదవిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్, అమరావతి డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) ఛైర్మన్‌ పదవిని తెనాలి సీటును త్యాగం చేసిన ఆలపాటి రాజాకు ఇస్తారని సమాచారం.
  మరికొందరికి కీలకమైన పార్టీ పదవులు ఇవ్వనున్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలి పదవి ఇవ్వనున్నారు. తెలుగు యువత విద్యార్ధి, రైతు సహా అనేక అనుబంధ పదవులునకు కూడా కీలక నేతలకు ఇస్తారని అంటున్నారు.
   మొత్తం పదవుల్లో 70 శాతం టీడీపీ వారికే ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. జనసేనకు 25 శాతం, బీజేపీకి 5 శాతం పదవులు ఇచ్చేలా కూటమిలో ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు.

TOP STORIES