తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమల్లోకి వచ్చినట్టు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజానికి ఎప్పటినుంచో ఈ నిబంధన ఉంది. కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. ఇటీవల తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందని ప్రభుత్వమే వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగిందని విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలో దానిపై పెద్ద దుమారమే రేగింది. సుప్రీంకోర్టు జోక్యంతో చివరికి ఆ రగడ ఆగింది తప్ప రాజకీయ నాయకులు మాత్రం వెంకన్నను రాజకీయాల కోసం ఇష్టానుసారం వాడుకుంటూనే ఉన్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలపైకి వచ్చిన తర్వాత ఎవరూ రాజకీయాలు మాట్లాడవద్దని వస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాజకీయాల మయమైన తిరుమలలో ఈ ఆదేశాలు ఏ మేరకు అమలు అవుతాయో వేచి చూడాలి.