ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. శనివారం ఉదయానికి కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని చెప్పారు. తుఫాన్ ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తమిళనాడులో భారీ వర్షాలు
దీని ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుత్తురై, తిరువారూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కడలూరు, నాగపట్నం తీరం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరి, కారైకాల్, కడలూరులో విద్యా సంస్థలకు సెలవిచ్చారు. రేపు తుఫాన్ కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.