బూడిద తరలింపుపై ఎన్డీఏ కూటమిలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు నడుం బిగించారు. వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై టిడిపికి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బిజెపికి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని సమాచారం అందింది.
ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇది వరకు జేసీ వర్గీయులే బూడిద తరలించుకుపోతుండగా.. రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో బూడిదను వాహనాల్లో నింపకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రి రాకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డగించారు. ఈ వివాదం ముదరడం, ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమంటూ నేతలను హెచ్చరించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశానికి ముగ్గురు నాయకులకు సమాచారం అందింది.