Andhrabeats

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి – సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై శివసేన (ఉద్ధవ్‌ థాకరే) ముఖ్య నేత సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని శివసేన ఆరోపించారు. బ్యాలెట్‌ పేపర్లతో మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గాను 230 స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష కూటమి మహా వికాస్‌ అఘాడీ 46 స్థానాలను గెలుచుకుంది. శివసేన (ఉద్ధవ్‌) 95 సీట్లలో పోటీ చేసి కేవలం 20 మాత్రమే గెలుచుకుంది. శివసేనను చీల్చి సొంత పార్టీ పెట్టుకున్న షిండే వర్గం ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఓటింగ్‌ సరళికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయని సంజయ్‌ రౌత్‌ ఆరోపిస్తున్నారు. ముంబైలో సోమవారం సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు సంబంధించి తమకు 450 ఫిర్యాదులు అందాయని తెలిపారు. పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ అంశాలపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. అందుకే ఫలితాలను పక్కనబెట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని అన్నారు. కొందరు మహాయుతి అభ్యర్థులు భారీ తేడాతో విజయం సాధించడంపై సంజయ్‌ రౌత్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.
వారు చేసిన విప్లవాత్మక పనులు ఏమున్నాయని, అంత భారీ మెజార్టీతో వారు ఎలా గెలుస్తారని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఇటీవల పార్టీలు మారిన నేతలు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారని చెప్పారు. ఇది అనుమానాలకు తావిస్తోందని అన్నారు. శరద్‌ పవార్‌ వంటి సీనియర్‌ నాయకుడు తొలిసారిగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారని చెప్పారు.

TOP STORIES