సీనియర్ ఐఏఎస్ అధికారి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. ఆయన వైఎస్సార్‌సీపీ కోసం పని చేస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టులు నిర్వహించారని ఆరోపించారు. ఇటీవల పులివెందులకు చెందిన కంపెనీకి బిల్లులు క్లియర్ చేశారని విమర్శించారు. పదేపదే చెప్పినా ఆయన జగన్‌కు మద్ధతుగా ఉంటున్నారని పేర్కొన్నారు. గతంలో అనకాపల్లిలో డాక్టర్ సుధాకర్ మృతి చెందినప్పుడు దానిపై విచారణ చేయించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు.
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిపై టీడీపీ నేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులపై అధికార పార్టీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా, కొన్ని పత్రికలు, ఛానల్స్ తరచూ విరుచుకుపడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
గతంలోనూ పలువురు టీడీపీ నేతలు ఉన్నతాధికారులపై సోషల్ మీడియాలో ఆరోపణలు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి హరితను అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా నియమించిన వెంటనే ఆమెపై ఎక్స్‌లో అవినీతి ఆరోపణలు చేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి పోస్టు పెట్టడంతో ఆమె బదిలీ అయ్యారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై కొన్ని పత్రికలు కథనాలు రాయడంతో ప్రభుత్వం ఆయన్ను పక్కనపెట్టి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ విధేయులని చెబుతూ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, క్రాంతి రాణా, విశాల్ గున్నీపై కేసులు నమోదు చేయించి అరెస్టుకు సైతం వెనుకాడలేదు.