Andhrabeats

అమెరికాలో దారుణం.. తెలుగు విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు సాయి తేజ మృత్యువాతపడ్డాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఖమ్మం రాపర్తి నగర్‌ కు చెందిన సాయి తేజ ఎంఎస్‌ చదివేందుకు నాలుగు నెలల క్రితమే అమెరికాలోని చికాగో వెళ్లాడు. అక్కడే పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నారు. శుక్రవారం దుండగులు ముసుకు వేసుకుని వచ్చి సాయి తేజను డబ్బులు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సాయి తేజ ఛాతిపై కాల్చి పారిపోయారు. బుల్లెట్‌ గుండెకు తాకడంతో సాయి తేజ అక్కడికక్కడే చనిపోయాడు. సాయి తేజ మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సాయి తేజ హైదరాబాద్‌లో బీబీఐ పూర్తి చేశాడు. మాస్టర్స్‌ డిగ్రీ కోసం చికాగో పక్కనే ఉన్న కాంకోడియా యూనివర్సిటీలో చేరాడు. అక్కడికి వెళ్లిన నెల రోజుల్లోనే ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌లో చేరాడు. ఐదు రోజులు కాలేజీకి వెళ్లే వాడు. రెండు రోజులు స్టోర్‌లో పని చేసే వాడు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగులు స్టోర్‌లోకి చొరబడ్డారు. దీంతో క్యాష్‌ కౌంటర్‌ను వారికి హ్యాండోవర్‌ చేసేసి సాయి తేజ పక్కకి వెళ్లాడు. దుండగులు క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న డబ్బు అంతా తీసుకున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్తూ సాయి తేజపై అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. దీంతో సాయితేజ అక్కడికక్కడే మరణించాడని సాయితేజ బంధువు తెలిపారు.

TOP STORIES