ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా పతకం గెలిచి తీరాలన్న సడలని పట్టుదలని ఒక భుజాన ఒలంపిక్ గ్రామానికి మోసుకొచ్చిందామె! మరి, బరువు పెరగదా?
మరొ భుజానేమో…. అధికారం, మందపు పొరై కళ్లను కప్పేసిన అంధకారంలో కనిపించకుండా పోయిన అవమానాలను, పదవీ మదం పట్టిన లాలసలో చెలరేగిన లైంగిక వేదింపులకు నిశ్శబ్దంగా నలిగిన ఆడపిల్లల మౌనరోదనలను, తప్పును శిక్షించమని దేశమెత్తు శోకమై రోదించినా వినిపించుకోని పాలనా క్రౌర్యాలను…
మూటగట్టి మోసుకొచ్చిందామె!
మరి, బరువు పెరగదా? పెరిగే వుంటుంది!
అందుకే, వంద గ్రాముల బరువు పెరిగి,
ఒలంపిక్ ప్రపంచ క్రీడల్లో… పతకం గ్యారెంటీ అయ్యాక కూడా అటు బంగారానికీ, ఇటు వెండికీ కొరగాకుండా పోయింది, పాపం!
ప్రతికూల పరిస్థితుల్లో
ఏళ్లుగా రగులుతున్న బాధ-కోపం కలగలిపి, దాన్ని శక్తిగా మలచిన మెళకువతో ఆమె ఒక్క రోజే, వెంట వెంట ముగ్గురు మహా మేటి వస్తాదుల్ని మట్టి కరిపించి కూడా…. ఒక కుస్తీ దూరంలో మళ్లీ పడిపోయింది. ఓడిపోకుండానే పతకానికి దూరమైంది.
సరే, పోతే పోయింది లేమ్మా ఓ పతకం, ఒక జీవిత కాలాన్ని పణంగా పెట్టి సాధించిన పతకాలను, అవార్డులను, కీర్తి కిరీటాలను కట్టగట్టి, తమకు జరిగిన అవమానాలకు నిరసనగా యమునలో పారవేస్తామన్న ఆత్మాభిమాన హిమవన్నగాలు మీరు! ఇది కాకపోతే ఇంకోటి వచ్చి వరిస్తుంది మిమ్మల్ని, మీ ప్రతిభని. సాంకేతిక కారణాలతో ఓ పతకం దక్కకుండా చేయగలరేమో… కానీ, పోరాడి గెలిచే మీ సత్తాను ఎవరేం చేయగలరు? అదెటుపోతుంది? పంచాంగాలు చిరిగిపోతేనేం, నక్షత్రాలుంటాయిగా!
డియర్ వినేశ్ ఫోగట్, ఇవాళ నీవు విశ్వ క్రీడా వేదిక మీద, ఓ చిన్న సాంకేతిక కారణంతో పడిపోయి వుండవచ్చు, కానీ మా హృదయాల్లో నీవు నిలిచే వుంటావు. 140 కోట్ల హృదయాలు గెలిచిన విజేతవు నీవు, జగద్విజేతవు! పడిలేచే కడలి తరంగానివి. మా ‘విశ్వంభర’ కవి సినారె ని గుర్తు తెస్తున్నావు.
‘అల నాకిష్టం. పడిపోతున్నందుకు కాదు. పడిన ప్రతిసారీ మళ్లీ లేస్తున్నందుకు’ అన్న ఆయన మాటలు నీ కోసమే! అవును డియర్ నీ కోసం!!