విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ బాటిల్ తో దాడి చేశాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బస్సుపై యాసిడ్ విసిరాడు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై అది పడింది. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై అది పడింది. దీంతో వారు కళ్లు మండి కేకలు వేశారు. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందించగా కొద్ది సేపటికే సాధారణ స్థితికి వచ్చారు.
పడిన ద్రావకాన్ని పోలీసులు పరిశీలించారు. నమూనాలను క్లూస్ టీం సేకరించింది. ద్రవాన్ని నిర్ధారించడానికి నమూనాని ఎఫ్ఎస్ఎల్ కి పంపినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. డ్రైవర్, బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిందితు పట్టుకున్నామని వారు వెల్లడించారు.