Andhrabeats

మీ ప్రేమాభిమానాలు వెయ్యి బంగారు పతకాల కంటే ఎక్కువ

– స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌

కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌ అనంతరం తొలిసారి దేశానికి వచ్చిన ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు శనివారం పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆమె తన స్వగ్రామమైన బలాలి చేరేవరకు ఏకంగా 135 కిలోమీటర్ల దూరం ర్యాలీగా కొనసాగారు. ఆ మార్గమంతా వీఐపీ కాన్వాయ్‌ని తలపించడం విశేషం.

ఇటీవల పారిస్‌ లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఫైనల్‌కు చేరిన మొట్టమొదటి మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫోగట్‌ చరిత్ర సృష్టించింది. కానీ, ఫైనల్లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైంది. ఈ బాధతోనే రెజ్లింగ్‌ కెరీర్‌కి ఆమె గుడ్‌బై చెప్పింది. అనంతరం ఆమె తన అనర్హతను సవాల్‌ చేస్తూ.. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌)ను ఆశ్రయించింది. కాస్‌ నుంచి ఎటువంటి సానుకూల ఫలితం దక్కలేదు. వినేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు కాస్‌ తీర్పునిచ్చింది.

తీర్పు అనంతరం భారత్‌కు వచ్చిన వినేశ్‌ ఫోగట్‌కు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఫోగట్‌ తన అభిమానులను ఉద్దేశించి స్పందిస్తూ.. పారిస్‌ ఒలింపిక్స్‌లో నాకు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వలేదు.. కానీ ఇక్కడి ప్రజలు ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మీ ప్రేమాభిమానాలు ఒలింపిక్‌ పతకాల కంటే విలువైనవి అంటూ ఆనందబాష్పాలతో చెప్పింది.  ఇవి వెయ్యి బంగారు పతకాల కంటే ఎక్కువ అని వ్యాఖ్యానించింది.

TOP STORIES