చాలామంది బావా మరదళ్లు, లేదంటే మావయ్యను, కజిన్స్‌ని పెళ్ళి చేసుకోవడం మన దేశంలో చాలాచోట్లే జరిగేదే. ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని సైన్స్ చెబుతోంది. దీన్ని కాన్‌శాన్‌గ్వినిటీ అని పిలుస్తారు. కాన్‌శాన్‌గ్వినిటీ అంటే రక్త సంబంధం, దగ్గర బంధువులను వివాహం చేసుకోవడం. ఈ తరహా పెళ్ళిళ్లు భారత్‌లో సుమారు 13.6 శాతం జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా 53 శాతం ఇలాంటి వివాహాలే జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. దక్షిణ భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి పెళ్ళిళ్లు జరుగుతున్నాయి.
జన్యు సంబంధిత వ్యాధులు..
కాన్‌శాన్‌గ్వినిటీ వల్ల పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు 30 శాతం ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా జంటలకు పుట్టిన పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగడం ఆలస్యం అవుతుంది. నాడీ సమస్యలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దగ్గర బంధువులను పెళ్ళి చేసుకోవడం వల్ల వారి పిల్లల్లో జన్యు సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
థలసేమియాతో పాటు సిస్టిక్ ఫైబ్రోసిస్ సమస్యలు కూడా వస్తాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఇక ఈ తరహా పెళ్ళిళ్లు చేసుకున్న వారి పిల్లలు చిన్నతనంలో మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. నవజాత శిశు మరణాలు కూడా ఎక్కువేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గర్భస్రావాల ఛాన్సులు కూడా అధికంగా ఉంటాయి.
నిజానికి ఈ కాన్‌శాన్‌గ్వినిటీ కొన్నిచోట్ల మతాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అంశం. ఇస్లామిక్ సంప్రదాయాల కారణంగా ముస్లిం దేశాలలో కాన్‌శాన్‌గ్వినిటీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్‌లో 61 శాతం, కువైట్‌లో 54 శాతం పెళ్ళిళ్లు బంధువుల మధ్యే జరుగుతాయి. ఇక విభిన్న సంస్కృతులు కలిగిన దేశాల్లో ఈ రేటు చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా, రష్యాలలో ఈ రేటు 0.1 శాతం మాత్రమే ఉంటుంది. అక్కడ పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు రావడం అందుకే అరుదుగా జరుగుతుంటుంది.