Andhrabeats

ఏపీకి కర్నాటక పనికిరాని ఏనుగులు ఎందుకిచ్చింది?

kumki elephants
కర్నాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని భరించలేక, మేపలేక అక్కడి ప్రభుత్వం ఆ ఏనుగుల్ని ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడంలేదు. తీసుకువచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్‌ కూడా నిర్వహించలేదు. దీన్నిబట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది.
తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు, ఒడిస్సా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో అడవి ఏనుగులు ఊళ్లపై పొలాల్ని ధ్వంసం చేయడం, మనుషులపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఈ అడవి ఏనుగుల్ని మళ్లీ అడవిలోకి తరిమికొట్టాడానికి కర్నాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చాక ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేసిన హడావుడి చేశారు. ఇందుకోసం ఆయన రెండుసార్లు కర్నాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు.
గత మే నెలలో ఆయన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా నాలుగు ఏనుగుల్ని ఏంతో వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3,695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. ఈ ఏనుగుల విషయంలో పవన్‌ కళ్యాణ్‌ ఎంతో చొరవ చూపారని ఆయన వల్లే కుంకీ ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు తెలిపారు. రంజన్‌ (26), దేవ (39), అభిమన్యు (14), కృష్ణ (15) అనే ఏనుగుల్ని ఏపీకి అప్పగించగా మరో రెండు ఏనుగుల్ని త్వరలో ఇస్తామని తెలిపారు.
రెండు నెలలైనా ఒక్క కుంకీ ఆపరేషన్‌ లేదు
స్వీకరించిన ఈ ఏనుగుల్ని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్‌ క్యాంప్‌లో ఉంచారు. అవి వచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్‌ కూడా నిర్వహించలేదు. ఎందుకని ఆరా తీయగా వాటికి కుంకీ ఆపరేషన్‌ చేసే సామర్థ్యం లేదని తేలింది. ఆపరేషన్‌ సంగతి దేవుడెరుగు కనీసం వాటిని పోషించడం కూడా దండగని అటవీ శాఖాధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అందులో దేవ అనే ఏనుగు గుడ్డిదని సమాచారం. అది ఒక కంటితో మాత్రమే చూడగలదని అటవీ శాఖాధికారులు గుర్తించారు.
మరో ఏనుగు రంజన్‌కి మానసిక వైకల్యంతో బాధపడుతోంది. దాని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో దాన్ని అదుపు చేయడం శిక్షణ పొందిన మావటీల వల్ల కూడా కావడంలేదు. మిగతా రెండు ఏనుగులకు సైతం కుంకీ ఆపరేషన్‌ చేసే సామర్థ్యం లేదు. ఎందుకూ పనికిరానివి కావడంతో కర్నాటక ప్రభుత్వం బహుమతి పేరుతో వాటిని మనకు అంటగట్టేసింది. దాన్ని పవన్‌ తన ఘనతగా ప్రచారం చేసుకున్నారు. తీరా ఇప్పుడు విషయం తెలిశాక మన అటవీ శాఖ కక్క లేక మింగలేక నీళ్లు నములుతోంది. వాటికి అసలు కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ ఇచ్చే పరిస్థితి లేదు. అదేమీ చేయకపోగా అవి ఉన్నంతకాలం వాటిని అటవీ శాఖ భరించాల్సిందే.
ఒక ఏనుగును క్యాంప్‌లో పెంచాలంటే ఏడాదికి రూ.25 లక్షలు ఖర్చువుతుంది. వాటికి ఆహారం, సౌకర్యాలు, వైద్యం వంటివన్నీ చూసుకోవాలి. అంటే నాలుగు ఏనుగులకు ఏడాదికి కోటి రూపాయల ఖర్చు. మరో 25 ఏళ్లపాటు ఈ ఖర్చు పెట్టాల్సివుంటుంది. పవన్‌ కళ్యాణ్‌ అత్యుత్సాహం, ఏపీ అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగం లేని ఏనుగుల్ని తెచ్చి కూటమి ప్రభుత్వం నెత్తిన పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలియక మదనపడుతోంది.

TOP STORIES