Andhrabeats

తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక అంత ఈజీ కాదు

రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీలో చేసిన సవరణల ప్రకారం రూపొందించిన నిబంధనలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఈ మేరకు 1908 ఏపీ రిజిస్ట్రేషన్‌ నిబంధనల్ని సవరిస్తూ శుక్రవారం కూటమి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలో భూముల లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు చరమగీతం పాడేలా 2023 ఫిబ్రవరిలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల చట్టాన్ని సవరించింది. అక్రమాలు నిరోధించేందుకు పలు సెక్షన్లు మార్చింది. అది కేంద్ర పరిధిలోని చట్టం కావడంతో ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. కేంద్రం వెంటనే దాన్ని ఆమోదించక పోవడం, ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఆ వ్యవహారం మరుగున పడింది. తాజాగా ఇటీవల ఆ చట్ట సవరణలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఈ నేపథ్యంలో ఆ చట్ట సవరణల ప్రకారం తాజాగా రిజిస్ట్రేషన్ల నిబంధనలను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫోర్జరీ డాక్యుమెంట్లపై ఉక్కుపాదం
ఏదైనా డాక్యుమెంట్‌ ఫోర్జరీదని, మోసపూరితంగా సృష్టించినట్లు కోర్టు నిర్ధారించి ఆ విషయాన్ని రిజిస్ట్రార్‌కు సమాచారం ఇస్తే.. దాన్ని రిజిస్టర్‌ చేయకూడదు. ఆ డాక్యుమెంట్‌ని తిరస్కరించినప్పుడు అందుకు గల కారణాలను రిజిస్ట్రార్‌ తన రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా అక్రమార్కులు ఫోర్జరీ పత్రాలతో ఆస్తులను కాజేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. కోర్టులు లేదా చట్టబద్ధమైన సంస్థల ద్వారా అటాచ్మెంట్లో ఉన్న స్థిరాస్తుల బదిలీని నిరోధించేందుకు కొత్త నిబంధన. అటాచ్మెంట్‌ ఆర్డర్‌ జారీ చేసే అధికారి సంబంధిత ఆస్తి పూర్తి వివరాలు (సర్వే నంబర్, సరిహద్దులు) తెలిపిన వెంటనే ఆ వివరాలను రిజిస్ట్రార్లు నిషేధిత ఆస్తుల రిజిస్టర్‌ లో నమోదు చేయాలి. అటాచ్‌మెంట్‌ అమల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయకూడదు.

ఒకసారి రిజిస్టర్‌ అయిన సేల్‌ డీడ్‌ రద్దు చేయాలంటే, ఆ పత్రంలోని పార్టీలందరి పరస్పర సమ్మతి, లేనిపక్షంలో కోర్టు–ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలి. దీంతో ఏకపక్షంగా సేల్‌ డీడ్‌ రద్దు చేయడం ఇకపై కుదరదు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలకు అప్పగింత. అక్రమ రిజిస్ట్రేషన్లపై ఎవరైనా జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసే అవకాశం. దానిపై జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవో, జిల్లా రిజిస్ట్రార్లతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు. కమిటీ కన్వీనర్‌ గా ఉన్న జిల్లా రిజిస్ట్రార్‌ నివేదిక ప్రకారం తుది నిర్ణయం తీసుకుని సంబంధిత రిజిస్ట్రేషన్‌ ను రద్దు చేస్తారు.

అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన సబ్‌ రిజిస్ట్రార్లపై విచారణ జరిపి, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చే ఫిర్యాదులు, జారీ చేసిన నోటీసులు, కమిటీ నివేదికలు, తీసుకున్న చర్యలన్నింటినీ ఫామ్‌–2 పేరుతో ప్రత్యేక రిజిస్టర్లో భద్ర పరచాలి. తద్వారా ప్రతి కేసు స్టేటస్‌ పారదర్శకంగా ఉంటుంది.

TOP STORIES

Scroll to Top