Andhrabeats

తెలంగాణలో ఆంధ్రా విద్యార్థుల అగచాట్లు

ap students problems in telangana

 

ఇంజనీరింగ్ విద్య కోసం కోటి ఆశలతో తెలంగాణా వెళ్లిన ఆంధ్రా విద్యార్థుల వెతలు వర్ణనాతీతంగా వున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా తెలంగాణలో ఆంధ్రా ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి కానవస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు వగైరా సదుపాయాలు ఆశించి తెలంగాణకు వెళ్లిన ఏపీ విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. రెండేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో వుండడంతో విద్యార్థులు తీవ్ర అగచాట్లు కు గురవుతున్నారు. ఫీజు కోసం కళాశాల యాజమాన్యాలు మెడపై కత్తిపెట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తమ పిల్లల కష్టాలు చూసి కడుపుకోతకు గురవుతున్న తల్లిదండ్రులు పుస్తులమ్మినా అంతంత ఫీజులు చెల్లించలేక సతమతమవుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు వినతులు వెల్లువెత్తున్నాయి. ఇంజనీరింగ్ విద్య కు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి ఈ కోర్స్ చదివే విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది .ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకం అమలకు పెద్దగా ఆటంకాలు ఎదురు కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఈ పథకం అమలు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంటర్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే మొగ్గు చూపుతున్నారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఈ కోర్సులు చేస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 425 ఇంజినీరింగ్ కళాశాలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఆంధ్రా నుంచి ఏడాదికి సుమారు రెండు లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు.

ఇంజనీరింగ్ కళాశాలలు తెలంగాణా కంటే ఆంధ్రాలోనే అధికంగా ఉన్నప్పటికీ వివిధ కారణాలు రీత్యా పలువురు విద్యార్థులు తెలంగాణ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతారు. ఏపీలో 256 కళాశాలలు వుండగా తెలంగాణలో వీటి సంఖ్య 171గా వుంది . ఆయా కళాశాలలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతుండగా 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులలో బిపిఎల్ (బిలో ప్రాపర్టీ లైన్) కు దిగువున వున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తుంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటను దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏపీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు కోసం పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. తెలంగాణాలో మాత్రం అక్కడ కళాశాలలు ససేమిరా అంటున్నాయి .2023 – 24 నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ చదువుతున్న ఏపీ విద్యార్థులకు పీజీ రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక పోవడంతో తెలంగాణలో ఆంధ్రా విద్యార్థుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి.ఎపి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిందే నంటూ మొండి పట్టుదలతో ఉన్నారు.

2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో అమలపై అప్పట్లోనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయగా అలాంటి సమస్య లేదని ఆయా కళాశాలల యాజమాన్యాలు చెప్పుకొచ్చారు . 2023- 24 బ్యాచ్ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ రియంబర్స్మెంటు పథకం వర్తిస్తుందని ఘంటాపథంగా కళాశాల యజమాన్యాలు పేర్కొన్నాయి. తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలు దీనిని వక్కాణించాయి. తీరా ఆ పథకం అమలు కొంత మేర జాప్యం కావడంతో విద్యార్థులపై తెలంగాణలో తీవ్రమైన ఒత్తిడి మొదలయింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తమకు పనిలేదని విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజు చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు.అంతేకాకుండా ఆలస్యమయితే పైన్ వసూలు చేస్తున్నారు .అధిక మొత్తంలో ఈ పైన్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. వీటికి రెస్పాండ్ కాకపోతే తీవ్ర మైన వేదింపులకు గురిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏటా 4.5 లక్షలు మంది ఇంటర్ విద్య నభ్యసిస్తున్నారు . వీరిలో 80 నుంచి 85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో అత్యధికులు ఇంజనీరింగ్ విద్యకు వెళ్తున్నారు.. ఈ ఏడాది ఏపీలో 4.30 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా వారిలో 83 శాతం మంది ఉత్తీర్లులయ్యారు .వారి సంఖ్య 3.52 లక్షలు కాగా వారిలో 2.64 లక్షల మంది ఎంసెట్ ఎగ్జామ్ రాశారు . వీరిలో లక్షా 90 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు అర్హత సాధించారు. అలాగే ఏపీతోపాటు తెలంగాణ ఎంసెట్ కు ఆంధ్రా విద్యార్థులు హాజరవుతారు .

వీటిలో అర్హత పొందిన వారు తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు .వీరిలో బిపిఎల్ కు దిగువున వున్న విద్యార్థులు ఫీజు వెతలు ఎదుర్కొంటున్నారు. వీరి సంఖ్య తెలంగాణలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు శాతం వరకు ఉండవచ్చని అంచనా.
వీరంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రెండేళ్ల నుంచి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు .సంవత్సరానికి కళాశాల ఫీజు లక్షా 40 వేలు కాగా యూనివర్సిటీ ఫీజు, ఎగ్జాం ,హాస్టల్ ఫీజు తో ఒక్కొక్క విద్యార్థికి కనీసం 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటిలో కళాశాల (ట్యూషన్) ఫీజు మాత్రం ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంటు కింద చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని తల్లిదండ్రులే కట్టుకోవాల్సి ఉంది. అష్ట కష్టాల పడి అవి కట్టడానికే నానా తంటాలు పడుతున్న తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు లక్షా 40 వేల రూపాయలు చెల్లించాలంటే వారికి మోయలేని భారం అవుతుంది. నాలుగేళ్లలో ఈ మొత్తం 10 లక్షలు రూపాయలు అవుతుంది. ఈ ఫీజు చెల్లించడం అంటే తల్లిదండ్రుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టే . దీంతో తెలంగాణా లో ఆంధ్రా విద్యార్థుల ఇంజనీరింగ్ చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి కానవస్తోంది .అందుకే ఏపీ ప్రభుత్వం కనికరించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సముచిత నిర్ణయం తీసుకొని ఫీజు రియంబర్స్ మెంట్ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా ఇంజనీరింగ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.

TOP STORIES