సంతానం కోసం వేయి కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్న దంపతుల మనోభావాలతో ఆడుకుంటూ మానవత్వానికే మాయ తెచ్చేలా ఐవీఎఫ్ పేరుతో డాక్టర్ నమ్రత చేసిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సికింద్రాబాద్ లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ పేరుతో నడుస్తున్న ఈ క్లినిక్‌లో బయటికొచ్చిన నిజాలు సామాన్యుల్ని కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి.
వాస్తవానికి, ఐవీఎఫ్ పద్ధతి అనేది సంతానాన్ని కోల్పోయిన దంపతులకు భరోసా కలిగించాల్సిన ఆధునిక వైద్య సాంకేతికత. కానీ కానీ అందుకు విరుద్ధంగా నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తూ డాక్టర్ నమ్రత యావత్ తెలుగు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
బిర్యాని – మద్యం.. వీర్యం – అండాలు!
వీర్యం సేకరించడానికీ, అండాలు తీసుకోవడానికి ఈ క్లినిక్ దాతలను ఎలా ఆకర్షించిందో తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
- చదువుకున్న వారికైతే రూ.1000–4000
- మహిళలకు రూ.20,000–25,000
- కానీ, వీర్యం దాతలుగా మారుతున్నవారు చాలా మంది బిచ్చగాళ్లు, గుడిసెల్లో ఉండే యువకులు
- వారికి బిర్యాని, మద్యం ఇచ్చి మాయ చేస్తూ వీర్యం తీసుకున్నారు.
- పోర్న్ వీడియోలు చూపిస్తూ వీర్య సేకరణ కేంద్రంగా ఈ క్లినిక్ పనిచేస్తోంది
నియమాలను పక్కన పెట్టేశారు
ఒక స్పెర్మ్ డోనర్ నుంచి 25 సార్లు మాత్రమే వీర్యాన్ని తీసుకోవాలి. అదే డోనర్ వీర్యాన్ని ఒక్క మహిళకే, ఒక్క IVF సైకిల్‌కి మాత్రమే ఉపయోగించాలనేది స్పష్టమైన గైడ్లైన్. కానీ ఇక్కడ:
- ఒకే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి వీర్యం తీసుకోవడం
- జాతి, విద్యార్హత, ఆరోగ్య ప్రమాణాలేమీ లేని దాతలతో నింపేసిన వీర్య బ్యాంక్
- ఇలా తీసుకున్న వీర్యంతో ఎన్నో కుటుంబాలను మోసం చేయడమే కాకుండా, జన్యుపరమైన సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం
పాత దందాలు – కొత్తగా తెరపైకి
ఈ డాక్టర్ నమ్రత గతంలో కూడా ఇలాంటి మాయాచారాల్లో పాల్గొని అరెస్టైనవారే.
- 2019లో విశాఖపట్నం,
- 2021లో విజయవాడ
లో ఆమె నిర్వహించిన IVF క్లినిక్స్‌లోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. కొంతకాలం నిందితురాలిగా ఉండి, కుదుటపడిన తర్వాత మళ్లీ సికింద్రాబాద్‌లో తన సామ్రాజ్యాన్ని పునఃప్రారంభించారు.
ఐవీఎఫ్ పేరుతో నడుస్తున్న మాయా ప్రపంచం
ఐవీఎఫ్ పేరుతో నడుస్తున్న కొన్ని క్లినిక్స్ వాస్తవానికి ‘సంతానం దందా కేంద్రాలుగా’ మారిపోయాయి. ఒక్కో క్లినిక్ వెనుక పదుల సంఖ్యలో మధ్యవర్తులు, దాత మాఫియా, ల్యాబ్ టెక్నీషియన్లు కలిసి పనిచేస్తూ “ఆరోగ్యాన్ని కాదు – డబ్బునే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.”
పోలీసుల దాడిలో ఏడు అరెస్టులు
తాజా కేసులో డాక్టర్ నమ్రతతో పాటు మరో 7 మంది సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. క్లినిక్ లోపల నుంచి పలు అభ్యంతరకరమైన పరికరాలు, డేటా, ఫేక్ డోనర్ వివరాలు, రిజిస్టర్లు, వీడియో ఫుటేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు విస్తృతంగా వెళ్లే అవకాశం ఉంది.
బాధితుల దిగ్భ్రాంతి
పిల్లల కోసం ఎన్నో ఆశలతో లక్షల రూపాయలు ఖర్చు చేసిన దంపతులు ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. “పిల్లల్ని కనాలనే తపనను ఇలా దొంగిలిస్తారా?” అంటూ కన్నీరు కారుస్తున్నారు. “మన బిడ్డ తెలివైనవాడిగా ఉండాలనే ఆశ పెట్టుకున్నాము.. కానీ బిచ్చగాడి వీర్యం వాడారని తెలుసుకుని తట్టుకోలేకపోతున్నాం..” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు శాస్త్రం.. మరోవైపు మానవత్వం. ఐవీఎఫ్ అంటే ఒక పరిశుద్ధత ఉన్న ప్రక్రియగా ఉండాలి. కానీ డాక్టర్ నమ్రత వంటి వారి వల్ల ఈ రంగం పాడు అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖలు కళ్ళు తెరిచి, ఈ దందాలపై పట్టు సాధించాలి. లేదంటే.. ఈ బిచ్చగాళ్ల వీర్యం మాయాజాలం ఇంకా ఎందరో జీవితాలను మాయం చేస్తూనే ఉంటుంది.