పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొట్టమొదటి పిరియాడిక్ హిస్టారికల్ వార్ డ్రామా హరిహర వీరమల్లు.. సుమారు ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉన్నా కూడా ఎక్కడా క్రేజ్ తగ్గని చిత్రం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాను నిర్మాత ఏయం రత్నం తనయుడు,గతంలో నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ మరియు రీసెంట్గా రూల్స్ రంజన్ చిత్రాల దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ముందుగా క్రిష్, ఆ తర్వాత జ్యోతి కృష్ణ కలసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేశారు.
చిత్రీకరణ చేసిన రోజులు తక్కువే అయినప్పటికీ కరోనా, ఎన్నికల ప్రచారం, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ విధి నిర్వహణ వంటి అంశాల వల్ల బాగా ఆలస్యమైంది. బజ్ తక్కువ ఉందని కామెంట్స్ వచ్చినప్పటికీ ట్రైలర్ విడుదల తర్వాత,ప్రమోషన్లలో ఎప్పుడు పాల్గొనని పవన్ కళ్యాణ్ పాల్గొనడం వల్ల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. ఒక విధంగా అంచనాలు తక్కువగా ఉండటం సినిమాకు కలిసి వచ్చిందనేచెప్పాలి. అయితే పవన్ ప్రచారంతో బాక్సాఫీస్ దగ్గర ఒక రకమైన జోష్ కనిపించింది.
సినిమా విషయానికొస్తే 16వ శతాబ్ధంతో మొదలైన ఈ కథలో ఎన్నో దురాగతాలకు పాల్పడుతున్న మొఘల్ చక్రవర్తి పరిపాలన, అతని పాలనలో జరిగిన బలవంతపు మతమార్పిడులు,
ఒప్పుకోని వారిపై హిందువులపై రుద్దిన జిజియా పన్నులు, రాజ్యంలో ఆకలి కేకలు, చావులతో అస్తవ్యస్తమైన పరిపాలన ఇలా ఓ రకంగా చెప్పాలంటే పూర్తి చారిత్రక నేపథ్యం ఈ చిత్రానికి కథా వస్తువు.గుర్రాలూ, రాజుల కోటలూ, వారి ఆహార్యాలూ, వస్త్రధారణలూ అన్నీ చూడడానికి బావున్నాయి. కథా నేపథ్యం కూడా దాదాపు అదే కాలానికి చెందినది కావడం వల్ల అక్కడక్కడా కొంత సైరా,బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో అనిపిస్తాయి విజువల్స్.
ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల తర్వాత తను స్క్రీన్ మీద కనిపించే సరికి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించాడు.. తన గడిచిన నాలుగైదు సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో మనం చూడొచ్చు.గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం,ఇష్టం రెండూ కనిపించాయి. ఫస్టాఫ్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ,మచిలీపట్నం రేవు ఫైట్, కుస్తీ యుద్ధం, కొల్లగొట్టినాదిరో సాంగ్, చార్మినార్ ఫైట్ ఇవన్నీ కూడా జనాలకు నచ్చుతాయి. అలాగే ఫస్టాఫ్ కు సంబంధించి మేకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
అసలు చిక్కంతా సెకండాఫ్ తోనే..సెకెండ్ ఆఫ్ కూడా ఫస్టాఫ్ రేంజ్ లో ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది కదా అనుకుంటూ ఉన్న టైం లో సెకెండ్ ఆఫ్ కథ ఎటు నుండి ఎటో వెళ్ళడం,చాలా చోట్ల లాగ్ అవుతూ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్ గా ఉండటంతో ఓవరాల్ గా సెకెండ్ ఆఫ్ ఫస్టాఫ్ ఇచ్చిన గుడ్ ఇంప్రెషన్ ని మర్చిపోయేలా చేస్తుంది..పవన్ కళ్యాణ్ వెసులుబాటు కోసం అమరావతిలో సెట్స్ వేసి తీసిన సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అసలు బాలేదు. కథలో కంటెంట్‌ను విజువల్స్ క్వాలిటీ డిస్టర్బ్ చేస్తుంది.ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలోనూ ఉన్న పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చే కొన్ని డైలాగ్స్ జనసేన కార్యకర్తలలో జోష్ నింపేవిగా ఉన్నాయి. సనాతన ధర్మం నేపథ్యంలో వచ్చిన ఎపిసోడ్ పర్వాలేదు. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో చాలా బాగా నటించింది. బాబీ డియోల్ ఔరంగజేబుగా తన క్రూరత్వం చూపించాడు.
మిగతా నటులు అంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి’హరిహర వీరమల్లు’కు తన స్వరాలతోనే కాకుండా నేపథ్య సంగీతంతోనూ ప్రాణం పోశారు. సెకండ్ హాఫ్ లో ఇంకా సినిమా నిలబడి ఉందంటే దానికి కారణం కీరవాణి సంగీతమే.జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస తమ సినిమాటోగ్రఫీ సిల్క్స్ చూపించారు. తోట తరణి ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్స్ వేశారు. ఫైట్ సీక్వెన్స్ లు అన్నీ మాస్ ఆడియెన్స్మెచ్చేలా ఉన్నాయి.
విస్తారమైన కథ, భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్ ఇవేవీ సామాన్య ప్రేక్షకుడి మనసు లోతుల్లోకి వెళ్ళి ప్రభావం చూపించలేకపోయాయి. ఎవరో మొదలు పెట్టిన వంటను వేరెవరో పూర్తి చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావన కలుగుతుంది.ఐదు ఏళ్లుగా ఈ సినిమా అనేక సమస్యలను ఎదుర్కొని రిలీజ్ కావడం వల్ల ఏర్పడిన ప్రతికూల అంశాలను పాజిటివ్‌గా మార్చేలా సన్నివేశాలకు రూపకల్పన చేశారు. కానీ ఫస్టాఫ్ అద్భుతంగా తీసిన దర్శకుడు క్రిష్ నే కంటిన్యూ చేస్తే ఒక గొప్ప చిత్రం మనకు దక్కేది. అందరూ తలో చెయ్యేసి పులిహార చేసేసారు.. అలాగని సెకండ్ పార్ట్ పై ఏదన్నా అంచనాలు పెంచేసారా అంటే అదీ లేదు.
చివరగా నెగిటివ్ ట్రోల్స్ పక్కనపెట్టి
హరిహర వీరమల్లు సినిమా వరకూ చూస్తే.. ఎలాంటి నిరాశ కలిగించదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, పైసా వసూలు చిత్రం…
త్రినాధ రావు గరగ
సీనియర్ జర్నలిస్ట్