Andhrabeats

‘సంఘీయులు’ కాకపోతే.. అంతే సంగతి…!

bjp power politics
‘నయా ముల్లా జ్యాదా ప్యాజ్‌ ఖాయా’ అని హిందీ లో ఓ సామెత.. ఇస్లాం మతం లోకి కొత్తగా మారిన బ్రాహ్మణుడు తాను ముస్లిం అని అందరికీ చెప్పుకోడానికి ఎక్కువ ఉల్లిపాయలు తింటాడు అని అర్థం.
ఆర్‌ ఎస్‌ ఎస్, ఇతర సంఘ్‌ పరివార్‌ నేపథ్యం లేకుండా బీజేపీలో చేరే నేతల పరిస్థితి కూడా అంతే. తాను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా… పాటిస్తున్నా… నేనూ బీజేపీ మనిషినే అని రోజూ నిరూపించుకుంటూ ఉండాలి. అంతవరకు ఏ పార్టీ లో లేకుండా బీజేపీలో చేరే నాన్‌
ఆర్‌ ఎస్‌ ఎస్‌ నేతలకు కొంత వరకూ పర్వాలేదు. వాళ్ళ కు అంతకు ముందు రాజకీయ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమీ ఉండదు.. కానీ కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీజేపీ లో చేరే నేతలకు మాత్రం ఆ వెసులుబాటు లేదు. గతం లో కాంగ్రెస్‌ లోనో ఇతర పార్టీల ట్రాక్‌ రికార్డు బరువైన లగేజీ లా మోస్తూ తాము బీజేపీ వాళ్ళమేనని నిరూపించుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు ఇక నా వల్ల కాదు అని కాడి పడేస్తే బీజేపీతో రాజకీయ ప్రయాణం ముగుస్తుంది. తాజా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కు అదే అనుభవం ఎదురైంది.
విషయ పరిజ్ఞానం ఉన్న ధన్‌ఖడ్‌ దూకుడు స్వభావి. అది కాంగ్రెస్‌ లో కొంత వరకూ చెల్లుతుందిగానీ బీజేపీలో అందులోనూ ప్రస్తుత మోదీ – అమిత్‌ షా జమానాలో ఏమాత్రం కుదరదు. అది గుర్తించలేక పోవడంతోనే ధన్‌ఖడ్‌ మరో రెండున్నరేళ్ల పాటు పదవీ కాలం ఉన్నాసరే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రముఖ న్యాయవాది అయిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ జనతాదళ్, కాంగ్రెస్‌ పార్టీలలో పదిహేళ్లనేకు పైగా కొనసాగిన అనంతరం 2003 లో బీజేపీ లో చేరారు. ఆ పార్టీలో మరో పదిహేళ్లు ఉన్నా సరే సరైన గుర్తింపు లభించ లేదు. బీజేపీ కి కొరకరాని కొయ్యగా మారిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కి ముప్పు తిప్పలు పెట్టాలనే టార్గెట్‌ తో 2019 లో ఆయన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ గా పంపారు మోదీ – అమిత్‌ షా. తాను బీజేపీ వాడినే అని రుజువు చేసుకునేందుకు ఆయన మమతా దీదీకి చుక్కలు చూపించారు. దాంతో ‘మొగాంబో ఖుష్‌ హువా’ అని మోదీ ఆయన్ని 2022లో ఉప రాష్ట్రపతిని చేశారు. ఉప రాష్ట్రపతిగా కూడా ధన్‌ఖడ్‌ బీజేపీపట్ల తన నిబద్ధతను నిరూపించుకునేందుకే తాపత్రయ పడ్డారు. చైర్మన్‌ హోదాలో ఆయన రాజ్య సభలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులపై మండిపడ్డారు. కేంద్ర మంత్రులకు కూడా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఎంపీలపై ధన్‌ఖడ్‌ ఎదురుదాడి చేశారు.. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో హుందాతనం ప్రదర్శించ లేదు.
ఎంతకాలం ఈ దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షూ…!
ఏదో ఒక రోజు కట్ట తెగాల్సిందే కదా…!
ఢిల్లీ హై కోర్టు పూర్వ న్యాయమూర్తి వర్మ అభిశంసన వ్యవహారంతో బీజేపీతో ధన్‌ఖడ్‌ కథ క్లైమాక్స్‌కు చేరింది. సుప్రీం కోర్టు తో సహా న్యాయ వ్యవస్థ ఆధిపత్యంపై ధన్‌ఖడ్‌కు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు కూడా లభించింది కూడా. దాంతో న్యాయ వ్యవస్థలో సంస్కరణవాదానికి తానే నేతృత్వం వహించాలని ఆయన భావించారు. అదే సమయంలో జస్టిస్‌ వర్మ వివాదం వ్యవహారం బయట పడింది.. వర్మ ను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్‌ లో అభిశంసన ప్రక్రియకు తానే నాయకత్వం వహించాలి అని ధన్‌ఖడ్‌ భావించారు.. అందుకే అభిశంసన తీర్మానాన్ని మొదట రాజ్య సభ లో ప్రవేశ పెట్టేలా బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ లో ( బీఏసీ) సమావేశం అజెండా రూపొందించేందుకు చొరవ చూపారు. ఈ అంశం లో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశం ఏమిటన్నది ఆయన పట్టించు కోలేదు. జస్టిస్‌ వర్మ అభిశంసన తమ ఘనత గా ఉండాలి తప్పా ఉప రాష్ట్రపతి కి ఆ కీర్తి రావడం మోదీకి ఏ మాత్రం ఇష్టం లేదన్నది ఆయన పట్టించు కోలేదు. అందుకోసం జస్టిస్‌ వర్మ అభిశంసన కోసం కాంగ్రెస్‌తోపాటు ఇతర విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసును ఆమోదించారు. ఆయన దూకుడు శైలి మోదీ కి కోపం తెప్పించింది. దాంతో ధన్‌ఖడ్‌ నిర్వహించిన రాజ్యసభ బీఏసీ మొదటి సమావేశం లో నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది.. రెండో సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జే పీ నద్దా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజీజు హాజరు కాలేదు.. ఉప రాష్ట్రపతి నిర్వహించిన సమావేశానికి కేంద్ర ప్రభుత్వ, అధికార పార్టీ ప్రతినిధులు ముఖం చాటేశారు.. అంటే ఉప రాష్ట్రపతి కి పొగ బెట్టారు. దీన్ని అవమానంగా భావించిన ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. మాకు కావల్సింది అదే అని ఆయన రాజీనామాను మోదీ వెంటనే రాష్ట్రపతి తో ఆమోదింపజేశారు.
అదే ఆర్‌ ఎస్‌ ఎస్‌ నేపథ్యం తో బీజేపీలో చేరిన వారికి ఆ ఇబ్బంది ఉండదు. అధిష్టానం సంకేతాలను వాళ్ళు ముందే గుర్తించగలరు. ఎక్కడ తగ్గాలో గ్రహిస్తారు. గౌరవంగా తెరమరుగు అవుతారు. అంతటి అడ్వాణీతో సహా రామ్‌ మాధవ్, వెంకయ్య నాయుడు వరకూ అదే చేశారు. ఇంకా పొలిటికల్‌ కెరీర్‌ ఉన్న నేతలు కాస్త వెనక్కి తగ్గినా మళ్ళీ అవకాశాలు రావచ్చు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వంటి వాళ్ళు అందుకు ఉదాహరణ.. ఇది తమ పార్టీ అనే ధీమా వారికి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీ లో చేరిన నేతల పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తమకు ప్రాధాన్యం లేక పోయినా పట్టించుకోకుండా పని చేయాలి. అలా ఉండలేం అంటే వేరే దారి చూసుకోవాలి. తెలంగాణలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ కు ఆ సెగ తగిలింది. తుఫాను ఎప్పుడు తీరం దాటుతుందో చెప్పలేం. అదే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితుడైన తరువాత కూడా పార్టీ విధానానికి విరుద్దంగా తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనని కిషన్‌ రెడ్డి మొండికేసినా అధిష్టానం సమ్మతించింది. రాజకీయంగా జన్మతః బీజేపీ నేత అయితే అటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది.
ఇక ఏపీ బీజేపీ లో పదవి ఉన్నా లేక పోయినా శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పీవీఎన్‌ మాధవ్‌ తదితర ఆర్‌ ఎస్‌ ఎస్‌ బ్యాచ్‌ ‘ఏ బిడ్డా ఇది మా అడ్డా…’ అంటూ ఓ ప్రివిలేజ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఎంపీలు గా ఉన్నా సరే దగ్గుబాటి పురంధేశ్వరి , సీఎం రమేశ్‌ వంటి నేతలు మాత్రం పార్టీ సమావేశాల్లో పిలవని పేరంటానికి వచ్చిన వారిలా ఇబ్బందిగా అటూ ఇటూ కదులుతూ ఉంటారు. కాంగ్రెస్‌ తరపున సీఎం గా చేసిన సరే నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీ లో చొరవగా వ్యవహరించ లేరు. కాంగ్రెస్‌ లో ఉండగా తమకు శాఖల కేటాయింపుపై అప్పటి సీఎం కిరణ్‌ నే ప్రశ్నించిన కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ లో చేరగానే జావగారి పోయారు. ఆ ఉక్క పోత భరించ లేక బీజేపీ కి రాజీనామా చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చినా బీజేపీలో ఉనికి, పట్టు, గుర్తింపు నిలుపు కుంటున్న నేత ఒక్కరే ఉన్నారు… ఆయనే అస్సోం సీఎం హేమంత బిశ్వ శర్మ. ఆయన కూడా బీజేపీ పట్ల తన నిబద్దత నిరూపించుకునేందుకు సంఘ్‌ పరివార్‌ సభ్యుల కంటే తీవ్రంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికైతే ఆర్‌ ఎస్‌ ఎస్‌ నుంచి పూర్తి మార్కులు తెచ్చుకుంటున్నారు శర్మాజీ కా బేటా…!
హేమంత బిశ్వ శర్మ ఎవరో ఒకరో ఇద్దర్నో మినహాయిస్తే..ఆర్‌ ఎస్‌ ఎస్‌ నేపథ్యం నుంచి వచ్చిన వారికే బీజేపీలో పెద్ద పీట. రాజకీయంగా అదేమీ తప్పు కాదు.. ఆ విధానమే బీజేపీకి రాజకీయంగా ప్రత్యేకత తెచ్చి పెడుతోంది. లేకపోతే మరో కాంగ్రెస్‌ పార్టీ లా మారేది. అందుకు బీజేపీ హై కమాండ్‌ కే హై కమాండ్‌ ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఎప్పుడూ సమ్మతించదు. చేతిలో కొరడా పట్టుకుని నాగపూర్‌లో కూర్చుని చూస్తూ ఉంటుంది.
– వడ్డాది శ్రీనివాస్

TOP STORIES