ఇన్ఫోసిస్ మరోసారి తన ఉద్యోగులను తొలగించడంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది. మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 30-45 మంది ట్రైనీలను సంస్థ తాజాగా తొలగించినట్లు సమాచారం. ఈ ట్రైనీలు అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలోనూ ఇదే కారణంతో సుమారు 400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ తొలగించిన సంగతి తెలిసిందే.
తాజా లేఆఫ్‌లలో భాగంగా తొలగించబడిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాన్ని అందిస్తోంది. ఈ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) విభాగంలో 12 వారాల శిక్షణను అందించనుంది. ఈ శిక్షణ ఖర్చులను సంస్థే భరిస్తుందని తెలిపింది. అయితే BPM మార్గాన్ని ఎంచుకోని వారికి మైసూరు నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యంతో పాటు వారి స్వస్థలానికి ట్రావెల్ అలవెన్స్ ఇస్తామని తెలిపింది.
లేఆఫ్‌లపై వివాదం
ఇన్ఫోసిస్‌లో ఈ లేఆఫ్‌లు గత కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారాయి. ఫిబ్రవరిలో 350-400 మంది ట్రైనీలను తొలగించినప్పుడు, ఈ నిర్ణయాన్ని “అనైతికం, కార్మిక చట్టాల ఉల్లంఘన” అని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES) విమర్శించింది. ఈ సంఘటనపై కర్ణాటక కార్మిక శాఖ దర్యాప్తు చేసినప్పటికీ, ఇన్ఫోసిస్ ట్రైనీలను ఉద్యోగులుగా పరిగణించలేదని, కాబట్టి కార్మిక చట్టాలు వర్తించవని తేల్చింది. అయినప్పటికీ, NITES ఈ నిర్ణయాన్ని సమర్థించలేదు. ట్రైనీల హక్కుల కోసం పోరాడతామని ప్రకటించింది.శిక్షణలో భాగమేనని ఇన్ఫోసిస్ వాదన
ఇన్ఫోసిస్ మాత్రం తొలగింపులు లేఆఫ్‌లు కాదని, శిక్షణలో భాగంగా నిర్వహించే పనితీరు మూల్యాంకనాల ఆధారంగా జరిగాయని చెబుతోంది. “ప్రతి ట్రైనీ తమ పురోగతిలో మూల్యాంకనాలు కీలకమని తెలుసుకునే వస్తారు. మా శిక్షణ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది,” అని సంస్థ పేర్కొంది. అంతేకాకుండా, తొలగించిన ట్రైనీలకు సెవరెన్స్ పే, కౌన్సెలింగ్, ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలను అందిస్తున్నామని వెల్లడించింది.ఐటీ రంగంపై ప్రభావం
ఇన్ఫోసిస్‌లో జరుగుతున్న ఈ లేఆఫ్‌లు భారత ఐటీ రంగంలోని సవాళ్లను మరోసారి ఉద్ఘాటించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలపై దృష్టి సారిస్తున్న ఐటీ సంస్థలు, పాత సాంకేతికతల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులను క్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైనీలు, ఉద్యోగులు నిరంతరం తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.