తీవ్ర ఆరోపణలు ఉన్న అధికారిని అటవీ దళాల అధిపతిగా నియమించేందుకు రంగం సిద్ధమవుతుండడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. అటవీ శాఖలో పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్)గా పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన అధికారి కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలను చేసుకుని చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం అటవీ దళాల అధిపతిగా (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్సెస్) ఉన్న ఏకే నాయక్ త్వరలో రిటైర్ అవుతుండడంతో ఆ స్థానంలో హెడ్ఓడీగా తానే వస్తున్నట్లు అందరికీ చెప్పుకుంటూ అటవీ శాఖను నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయనపై తీవ్రమైన ఆరోపణలపై విచారణలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో మైక్రోప్లెక్స్ ఎరువుల సేకరణ, వినియోగంలో శాసనసభకు ఆయన తప్పుడు సమాచారం ఇచ్చినట్లు రుజువైంది. 8,505 కిలోల ఎరువులను వాడకుండానే వాడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ దర్యాప్తులో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలడంతో 2012లో అప్పటి ప్రభుత్వం ఆయన వేతనాన్ని ఒక స్థాయికి తగ్గించి శాశ్వతంగా తక్కువ స్థాయిలోనే ఉంచాలని ఆదేశించింది. దీనిపై ఆయన క్యాట్‌లో పిటీషన్ వేసినా ఆయనదే తప్పని, ఆయనపై వేసిన శిక్ష సరైనదేనని స్పష్టం చేసింది. అయితే శాశ్వత వేతన తగ్గింపును మూడు సంవత్సరాలకు పరిమితం చేసింది. దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లగా కోర్టు కొట్టివేసింది.
పదోన్నతుల వివాదం
శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యవహారంలో ఆయనకు విధించిన ఆదేశాలు అమలు జరక్కపోగా అన్ని పదోన్నతులు లభించాయి. డిప్యూటీ కన్సర్వేటర్ నుండి చీఫ్ కన్సర్వేటర్, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్, ఆ తర్వాత ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా పదోన్నతులు పొందారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారికిగాపై చర్యలు తీసుకోకపోగా వరుసగా పదోన్నతులు లభించడానికి ఆయన చేసిన లాబీయింగ్ కారణమని తెలిసింది. ఈ పదోన్నతులపై దర్యాప్తు చేయాలని 2025 ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొందరు ఫిర్యాదు చేశారు.
అలాగే కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లి రెండేళ్లు అక్కడ పని చేశాక ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఆయన అటు నుంచి అటే విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఒక ఏడాది తర్వాత తిరిగి వచ్చి తనకున్న పలుకుబడితో సర్వీసులో చేరి పదోన్నతులు పొందారు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన విషయంపైనా డీఓపీటీలో ఒక కేసు ఉంది. పీసీసీఎఫ్ హోదాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణ బృందాల నుంచి ఆయన భారీగా డబ్బులు తీసుకుంటున్నారనే ఫిర్యాదులున్నాయి.
వీటన్నింటిపైనా ఇటీవల కొందరు యూపీఎస్ఎస్సీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని యూపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆయనపై తీసుకోవాల్సిన చర్యలు, ఆయనకు వచ్చిన పదోన్నతుల తదితర అంశాలపై దర్యాప్తు చేయాలని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ముఖ్య అధికారి అండతో అటవీ శాఖలే సర్వం తానే అయినట్లు వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కూడా తప్పుదోవ పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి అధికారిని అటవీ దళాల అధిపతిగా నియమిస్తే ఇప్పటికే దిగజారిపోయిన ఆ శాఖ ఇంకా పాతాళంలోకి కూరుకుపోతుందని చెబుతున్నారు.