ఆగస్టు 12వ తేదీన పులివెందుల జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హోరాహోరీ పోరుగా మారింది. కేవలం ఒక జెడ్‌పీటీసీ స్థానానికే ఎన్నిక అయినా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటె ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గమే కాదు.. వైఎస్‌ఆర్ కుటుంబానికి బలమైన కోట. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబానిదే గెలుపు. అక్కడ మరో పార్టీ వేలు పెట్టే అవకాశం కూడా ఎప్పుడూ లభించలేదు. పులివెందులలో టీడీపీ ఎన్నడూ గెలవలేదు.
అక్కడి జెడ్‌పీటీసీ సి మహేశ్వర్‌రెడ్డి మరణించడంతో వచ్చిన ఉప ఎన్నిక ఈసారి టీడీపీకి ఒక కొత్త ఆశను సృష్టించింది. అధికార బలాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా జెడ్‌పీటీసీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నిక రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. జగన్ తన కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా, చంద్రబాబు తన ప్రత్యర్థిని దెబ్బతీయడానికి వ్యూహాలు పన్నుతున్నారు.
వైఎస్‌ఆర్ గడ్డపై ప్రతిష్టాత్మక పోరు
వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పులివెందుల కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు ఇది వైఎస్‌ఆర్ కుటుంబానికి రాజకీయ కేంద్రం. 1978 నుంచి ఈ సీటు ఆ కుటుంబానిదే. 2024లో జగన్ ఇక్కడ మూడోసారి గెలిచారు. 2019లో 90,110 ఓట్ల మెజారిటీ రాగా 2024లో అది 61,687కి తగ్గింది. జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్‌సీపీ ఆధిపత్యాన్ని సవాలు చేసే అవకాశంగా టీడీపీ భావిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన నేపథ్యంలో, జగన్‌కు ఈ ఎన్నిక కీలకం. ఇక్కడ ఓడిపోతే ఆయన రాజకీయ ప్రతిష్టకు మచ్చగా మారుతుంది.
టీడీపీ దూకుడు వ్యూహం
చంద్రబాబు నాయుడు పులివెందులను గెలవడం త ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ తరపున పులివెందుల ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) భార్య.. మారెడ్డి లతా రెడ్డిని బరిలోకి దించారు. బీటెక్ రవి గతంలో కడపలో వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబీకుడైన వై.ఎస్. వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వ్యక్తి. ఆగస్టు ఒకటో తేదీన కడప పర్యటన సందర్భంగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డిలతో కలిసి వ్యూహ రచన చేశారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా జగన్‌ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే విశ్వనాథ్‌రెడ్డి, పుష్పనాథ్‌రెడ్డి వంటి కొందరు నాయకులను టీడీపీలో చేరారు. అది స్థానికంగా రాజకీయ సమీకరణలను కొంతవరకూ మార్చింది.
జగన్‌కు వ్యతిరేకంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. ఏడాదిగా పెద్దగా బయటకు రాని ఆమె ఇప్పుడు పులివెందుల జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా బయటకు వచ్చి మాట్లాడడాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. జగన్‌ను దెబ్బకొట్టడం కోసం టీడీపీ ఆమెను రంగంలోకి దింపిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ రక్షణాత్మక వ్యూహం
వైఎస్సార్‌సీపీ పులివెందులను నిలబెట్టుకోవడం కోసం మరణించిన మహేశ్వర్‌రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్‌రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. సానుభూతి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో హేమంత్‌ను ఎంపిక చేసింది. తన కుటుంబానికి చెందిన కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, తన మామ పి. రవీంద్రనాథ్‌రెడ్డిలకు గ్రామస్థాయిలో మద్దతు సమీకరించే బాధ్యత అప్పగించారు జగన్. పులివెందులలో చేసిన అభివృద్ధిని చెబుతూ, యోగి వేమన యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభివృద్ధి వారసత్వాన్ని హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల ఇన్‌చార్జ్ వెల్పుల రామలింగపై టీడీపీ దాడులు చేయడం సంచలనంగా ఉంది. పులివెందులలో టీడీపీ అడుగు పెట్టడమే కష్టమనుకునే స్థితి నుంచి అధికారాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ ప్రజాప్రతినిధిపై దాడి చేయడం కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీ నేతలను సైలెంట్ చేయడం కోసం టీడీపీ పోలీసులను ఉపయోగించి వారిపై కేసులు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రెండు వర్గాలు దాడులు చేసుకుని పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటే వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు పెడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో మరో ట్విస్ట్ ఏమిటంటే వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన యడతి సునీల్ యాదవ్ అభ్యర్థిగా ఉండటం. టీడీపీ ఒక వ్యూహం ప్రకారం వివేకా హత్య కేసుపై చర్చ జరగాలనే ఉద్ధేశంతో అతన్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
15 పోలింగ్ స్టేషన్లలో 10,601 ఓటర్లు ఈ ఎన్నిక ఫలితాన్ని నిర్ణయించనున్నారు. టీడీపీకి పులివెందులలో విజయం ఒక అవసరంగా మారింది. 2024లో 175 అసెంబ్లీ సీట్లలో 164 సాధించిన వేగంతో టీడీపీ దూసుకెళుతోంది. ఆగస్టు 14న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పులివెందులపై అందరి దృష్టి నెలకొంది.




