Andhrabeats

చమురు మీద దురాశ.. సార్వభౌమత్వంపై దాడి

వెనుజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడూరోను అమెరికా ఎత్తుకెళ్లి విషయం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వెనుజులా, అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న ఘర్షణ పరిస్థితులు ట్రంప్ అధ్యక్షుడయ్యాక మరింత తీవ్రంగా మారిపోయాయి.

వెనుజులాలో ఉన్న చమురు సంపదపై హక్కు ఎవరిది అనే ప్రశ్న నుంచి, ఒక దేశానికి తన నిర్ణయాలు తానే తీసుకునే స్వేచ్ఛ ఉందా లేదా అన్న అంశం ఈ వ్యవహారంలో ఇమిడి ఉంది.

వెనుజులాలో ఉన్న చమురును మొత్తంగా దక్కించుకోవడానికి అమెరికా చేస్తున్న బల ప్రయోగం.. దాన్ని తిప్పి కొట్టేందుకు వెనుజులా చేసిన పోరాటం.. చైనా, రష్యా దేశాలు తమ ప్రయోజనాల కోసం వెనుజులాకు మద్దతు పలకడం వంటి ఎన్నో కోణాలు ఇందులో ఉన్నాయి.

వెనుజులా ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే సంపన్న దేశం. అపారమైన చమురు నిల్వలు ఆ దేశాన్ని సంపన్నంగా మార్చాయి.

కానీ ఆ చమురు నిల్వలే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారాయి. ఈ చమురు కోసం దశాబ్దాలుగా అమెరికా, వెనిజులా మధ్య పోరాటం జరుగుతోంది. 2009కి ముందు వెనుజులా చమురుపై అమెరికా ఆధిపత్యం సాధించి లాభాలు పొందుతుండేది. విదేశీ చమురు సంస్థలు, స్థానిక ఎలైట్ వర్గాలు అక్కడి చమురు నిల్వలను ఆధారంగా చేసుకుని అపరిమితమైన లాభాలను పొందేవారు. దీంతో ఆ దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరం బాగా పెరిగింది. ఇది సామాన్య ప్రజల్లో అసంతృప్తి రగిల్చింది.

ఈ నేపథ్యంలోనే వెనుజులా రాజకీయాలలో కీలక మలుపు వచ్చింది. 2009లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన హ్యుగో ఛావెజ్ వెనుజులా దిశనే మార్చేశారు. చమురు రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు. చమురు ఆదాయాన్ని పేదల సంక్షేమానికి మళ్లించారు. ఇది ప్రజలకు ఊరటనిచ్చినా, అమెరికాకు మాత్రం తీవ్ర అసహనాన్ని కలిగించింది. చావేజ్ ఉన్నంతవరకు అమెరికా రాజకీయాలను దీటుగా ఎదుర్కొన్నారు. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
2013లో ఛావెజ్ మరణించిన తర్వాత ఆయన వారసుడిగా నికోలస్ మడూరో అధికారంలోకి వచ్చాడు. ఛావెజ్ విధానాలనే కొనసాగిస్తూ, అమెరికా జోక్యాన్ని మరింత బహిరంగంగా వ్యతిరేకించాడు. చమురు మీద తమ దేశానికి ఉన్న హక్కును వదులుకోబోమని స్పష్టం చేశాడు. ఇదే అమెరికాతో సంబంధాలను పూర్తిగా చెడగొట్టింది.
ఇక్కడ నుంచి సంఘటనలు వేగంగా మారాయి. అమెరికా ప్రత్యక్ష దాడికి వెళ్లలేదు. కానీ ఆర్థిక ఆంక్షల రూపంలో వెనుజులాపై యుద్ధం మొదలుపెట్టింది. బ్యాంకింగ్ వ్యవస్థను కట్టడి చేయడం, చమురు ఎగుమతులను నిలిపివేయడం, ప్రభుత్వ ఆస్తులను విదేశాల్లో స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తీసుకుంది. ఫలితంగా వెనుజులా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కరెన్సీ విలువ పడిపోయింది. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో మడూరో అమెరికాకు పూర్తిగా వ్యతిరేకంగా నిలిచాడు. అమెరికాతో రాజీ అంటే దేశ చమురు విదేశీ చేతుల్లోకి వెళ్లడమే కాదు, తన పాలన కూడా కూలిపోతుందని ఆయన గ్రహించాడు. అందుకే సార్వభౌమత్వం అనే అంశాన్ని కేంద్రంగా పెట్టుకొని ప్రజలను ఒకటి చేశాడు. ఈ పోరాటంలో వెనుజులాకు అండగా నిలిచింది చైనా, రష్యా. వెనుజులాకు భారీ రుణాలు ఇచ్చింది. చమురు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. రహదారులు, విద్యుత్, నివాస గృహాల రంగాల్లో సహకరించింది. చైనాకు ఇది దీర్ఘకాల ప్రయోజనాల ఒప్పందం. భవిష్యత్తులో చమురు సరఫరా భద్రత, అలాగే అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే అవకాశం.
ఇక రష్యా వెనుజులాకు సైనికంగా, రాజకీయంగా మద్దతుగా నిలిచింది. ఆయుధాలు, శిక్షణ, అంతర్జాతీయ వేదికలపై రక్షణ కల్పించింది. దీన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయింది. తన పెరట్లోనే రష్యా ఉనికి పెరగడాన్ని సహించలేకపోయింది. వెనుజులాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షల యుద్ధం చేస్తూ ఆదేశాన్ని భ్రష్టుపట్టించింది.

ట్రంప్ కు ముందు ఉన్న అమెరికా అధ్యక్షులు వెనుజులా విషయంలో ఒత్తిడి చేసినప్పటికీ ఒక పరిమితిని పాటించారు. అయితే ట్రంప్ ఆ పరిమితులను లెక్కచేయలేదు. ఆయన రాజకీయ స్వభావమే దీనికి ప్రధాన కారణం. ట్రంప్ అంతర్జాతీయ చట్టాలు, దౌత్య సంప్రదాయాలకంటే తన నిర్ణయాన్నే పెద్దగా చూసే వ్యక్తి. పైగా చమురు కార్పొరేట్ల మద్దతు, దేశీయ రాజకీయాల్లో గట్టి నాయకుడిగా కనిపించాలనే ఆత్రం కూడా అతన్ని మరింత దుందుడుకుగా నడిపించింది. అందులో భాగంగానే వెనుజులాపై ఒత్తిడి మరింత పెరిగింది. పాలన మార్పే లక్ష్యంగా చర్యలు సాగాయి. డ్రగ్ వ్యాపారం వంటి ఆరోపణలు మోపడం, మడూరోను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడం మొదలయ్యాయి. చివరికి ఆ దేశంపై దాడి చేయలేదంటూనే దాడి చేసి అధ్యక్షుడిని అపహరించే వరకు వెళ్ళింది.

తక్షణం పెద్ద యుద్ధం జరిగే అవకాశాలు తక్కువ. కానీ ఆర్థిక, రాజకీయ ఒత్తిడి కొనసాగుతుంది. చైనా, రష్యా వెనుజులాను పూర్తిగా వదిలేసే అవకాశం లేదు. అవి తమ మద్దతును జాగ్రత్తగా, అవసరమైనంత వరకే కొనసాగిస్తాయి. అమెరికాతో నేరుగా ఢీకొనే స్థాయికి వెళ్లకుండా, తమ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి..అమెరికా దేశంలోనే ఈ పరిస్థితిపై ఒకే అభిప్రాయం లేదు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

TOP STORIES

Scroll to Top