క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ తో ప్రపంచ టెక్ మ్యాప్ లోకి అమరావతి అడుగుపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలతో అమెరికా సిలికాన్ వ్యాలీగా మారితే ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంతో అమరావతి క్వాంటం వ్యాలీగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రాజధానిలోని ఉద్దండ రాయుని పాలెం వద్ద సీఆర్డీఏ కేటాయించిన 50 ఎకరాల భూమిలో క్వాంటం వ్యాలీ టవర్స్ నిర్మితం కానున్నాయి. దేశంలో తొలి 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్స్ 2 తోకూడిన అమరావతి క్యాంటం కంప్యూటర్ సెంటర్ ను ను ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి. క్వాంటం కంప్యూటింగ్ సహా, కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ మారనుంది. క్వాంటం కంప్యూటర్ భవనాల శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ”అమరావతి, ఆంధ్రప్రదేశ్ తో పాటు భారత్ కు కూడా ఇదో చారిత్రాత్మక రోజు. క్వాంటం వ్యాలీ భవనాలతో పాటు గ్లోబల్ క్వాంటం రివల్యూషన్ లో భాగమైన నిపుణుల తయారీకి కూడా ఇది పునాది. ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది. ఇది క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్ గా ఇది నిలిచిపోతుందని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్ధ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ ఓ కీలకమైన ముందడుగు. వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందిపుచ్చుకోలేక పోయింది. కానీ ఐటీ విప్లవంలో మనం ముందడుగు వేశాం. గతంలో హైదరాబాద్ లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. అది ఓ గేమ్ చేంజర్ గా మారి ఫలితాలను ఇస్తోంది.
హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాం. భారత్ లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలకాలం గుర్తించుకుంటాం. సాంకేతిక విప్లవాన్ని ఆచరించే ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీఎస్ఎన్ ఎల్ 4 స్టాగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సాంకేతికత ద్వారా 6 జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యం అవుతుంది. ఇదే తరహాలో భారత్ నుంచి వేర్వేరు ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలని ఆకాంక్షిస్తున్నాను. వచ్చే 30 -40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చే అంశాలపై నేనెప్పుడూ ఆలోచన చేస్తాను. దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయి. టెక్నాలజీని అంది పుచ్చుకున్న దేశమే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తుంది. క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా ఏపీ మారుతుంది. అని ముఖ్యమంత్రి అన్నారు.
అమరావతి క్వాంటంలో క్వాంటం ఎకోసిస్టం
క్వాంటం డిజైన్స్, క్వాంటం ఉత్పత్తులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కు అమరావతి కేంద్రం అవుతుంది. డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ , ఫైనాన్స్, క్లైమాట్ మోడలింగ్ కు అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయి. ఇప్పటి వరకూ అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారు ఇక నుంచి అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నాం. దీనికి ఇక్కడున్న రైతులే ప్రధాన భాగస్వాములు. ఓ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా అమరావతి తయారవుతుంది. ప్రపంచ శ్రేణి క్వాంటం టెక్నాలజీ నగరంగా అమరావతి మారుతుంది. భారత్ లోని మొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సాంకేతికతను అందిపుచ్చుకున్న వ్యక్తిగా ప్రధాని మోదీ నేషనల్ క్వాంటం మిషన్ ను తీసుకువచ్చారు. దానిని ఏపీ అందిపుచ్చుకుంది. ఆలోచన చేసిన అతి తక్కువ సమయంలోనే ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. 2026 డిసెంబరు నుంచి ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. క్వాంటం కంప్యూటర్ల తయారీ కోసం కూడా మా ప్రయత్నాలు ప్రారంభించాం. క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను దేశానికి, ప్రపంచానికి తయారు చేసి ఎగుమతులు చేసే ఆలోచన చేస్తున్నాం. ఏప్రిల్ 14న ఇంటర్నేషనల్ క్వాంటం డే రోజున 2 స్వదేశీ క్వాంటం కంప్యూటర్లను రెఫరెన్సు ఫెసిలిటీ గా ఎస్ఆర్ఎం నుంచి ప్రారంభించ బోతున్నాం.క్వాంటం ద్వారా చేసిన ఆవిష్కరణలు నోబెల్ ప్రైజ్ సాధిస్తే రూ.100 కోట్ల నజరానా ఇస్తామని ప్రకటించాం. యువ మేధావులు అంతా దీనిపై పరిశోధనలు చేయాలని పిలుపునిస్తున్నాను. 2030 నాటికి 2.5 లక్షల మంది క్వాంటం నిపుణులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. వైసర్ సంస్థ ద్వారా క్వాంటం కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు పిలుపునిస్తే 50 వేల మంది నేర్చుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కోర్సులు అందించినప్పుడు దేశవ్యాప్తంగా 2.08 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 1.04 లక్షల మంది ఏపీకి చెందిన వారే. దశల వారీగా 35 లక్షల మందికి క్వాంటంలో శిక్షణ ఇచ్చేందుకు వైజర్ సంస్థ ముందుకు వచ్చింది. క్వాంటం ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం ముందుకు వచ్చింది. అందులో 10 లక్షల మంది ఏపీకి చెందిన యువతకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం.
త్వరలో ఏఐ లివింగ్ ల్యాబ్ యూనివర్సిటీ
మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఐఎస్ బీ తరహాలోనే ఏఐ లివింగ్ ల్యాబ్ యూనివర్సిటీని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నాం. ఏఐ, క్వాంటం ఏఐ లో కోర్సులు అందించేలా అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. తొలుత మేధా టవర్స్ లో దీనిని ప్రారంభించి ఆ తర్వాత అమరావతికి తరలిస్తాం. ప్రజలకు ఏఐ లాంటి సాంకేతికత ప్రయోజనం అందాలన్నదే మా ఆలోచన. ఔషదాల ఆవిష్కరణ, వ్యక్తిగత ఆరోగ్యం, వాతవరణ అంచనాలు, క్రాప్ ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, పంట ఉత్పత్తులు ఇలా వివిధ అంశాలను అంచనా వేసి సలహాలు అందిస్తాం. అవేర్ ద్వారా ఇప్పటికే ఈ రకమైన సేవలను అందిస్తున్నాం. క్వాంటం ద్వారా మరింత వేగంగా అందించ గలుగుతాం. క్వాంటంతో కూడిన లాజిస్టిక్స్ కారణంగా వ్యయం తగ్గుతుంది. బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్లో వినియోగించటం వల్ల రిస్క్ తగ్గుతుంది. సైబర్ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ దీని వినియోగం ద్వారా అతి తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి, పంపిణీ సాధ్యం అవుతుంది. నేషనల్ గ్రిడ్, క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో ఈ సాంకేతికత అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని భావిస్తు్న్నాను. కుప్పంలోని ఓ 7 తరగతి విద్యార్థి ఏఐ సాంకేతికత ద్వారా బీపీ లాంటి వ్యాధులను గుర్తించేలా యాప్ తయారు చేశారు.ఏపీలోని విద్యార్ధులంతా ఏఐ అల్గారిథమ్స్ లో శిక్షణ పొందాలని ఆకాంక్షిస్తు్న్నాను. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఒక్కటే కాదు, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్, సెమీ కండక్టర్స్ ఉత్పత్తి లాంటి అంశాల్లో ఇప్పటికే ముందడుగు వేశాం. అమరావతి డీప్ టెక్నాలజీ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పరిశ్రమల్ని, విద్యా రంగాన్ని, విద్యార్ధులకు పిలుపునిస్తున్నాను. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారత క్వాంటమ్ భవిష్యత్తుని నిర్దేశించే ప్రదేశంగా మారుతుంది. క్వాంటం వేగంతో నిర్ణయాలు తీసుకుంటాం. అదే వేగంతో పనులు జరిగేలా చూస్తాం. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
వ్యాలీ కంటే ముందే క్వాంటం సర్వీసెస్
అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం కంటే ముందే కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఆన్ లైన్ ద్వారా క్వాంటం క్లౌడ్ సర్వీసెస్ ను టీసీఎస్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ హారిక్ విన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు పరిశోధకులకు క్వాంటం క్లౌడ్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. పరిశోధనలు, ఆవిష్కరణలకు వీలుగా ఐబీఎం ఆధ్వర్యంలోని క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను కూడా సీఎం, కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. క్వాంటం నిపుణులను తయారు చేసేలా విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేలా వైసర్ సంస్థ ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను కూడా ఇరువురు నేతలు ప్రారంభించారు. దశలవారీగా 35 లక్షల మందికి క్వాంటంలో శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏప్రిల్ 14 తేదీన ఇంటర్నేషనల్ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో 2 స్వదేశీ క్వాంటం కంప్యూటర్లతో క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ ప్రారంభం కానుంది. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లు బహుమతులు అందించారు. నేషనల్ క్యాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ర్యాండమ్ నెంబర్ జనరేషన్, కీ డిస్ట్రిబ్యూషన్, క్వాంటం ఆప్టిమైజేషన్ ధీమ్ లతో ఏపీ ఉన్నత విద్యామండలి ఈ హ్యాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు పి.నారాయణ, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్, టీసీఎస్ సీటీఓ హారిక్, ఎల్ అండ్ టీ డైరెక్టర్ సతీష్ కుమార్, ఐఐటీ చెన్నై , తిరుపతి ప్రోఫెసర్లు కామకోటి, సత్యనారాయణ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
మేధా టవర్స్ నుంచి క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు
క్వాంటం టెక్నాలజీలో దేశానికి మార్గదర్శిగా నిలిచేలా అమరావతి నుంచి క్వాంటం కార్యకలాపాలను 20 కంపెనీలు ప్రారంభించాయి. క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలు అందుబాటులోకి వచ్చే లోగా తాత్కాలికంగా గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి 20 కి పైగా కంపెనీలు పని ప్రారంభించాయి. క్యూబీట్స్, సైబ్రానెక్స్, క్యూసీ లాయెర్వోయన్స్, పీడబ్ల్యూసీ, క్వాంటం ఏఐ గ్లోబల్, క్యూబిటెక్, క్వాన్ ఫ్లూయెన్స్, క్యూబిట్ ఫోర్స్, 42 ల్యాబ్స్, సినర్జీ క్వాంటం, క్విండ్రా, వైసర్, పీక్యూ స్టేషన్, ట్రైక్వాంటా, ఎల్ అండ్ టీఐ మైండ్ ట్రీ, ఐబీఎం, టీసీఎస్, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబరేటరీస్ తదితర సంస్థలు 149 మందితో ఈ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. మేడ్ ఇన్ ఇండియా క్వాంటం ప్రాసెసర్ల అభివృద్ధి, క్వాంటం సెక్యూరిటీ, డ్రగ్ డిస్కవరీ, బ్యాంకులకు పోస్ట్ క్వాంటం రెడీనెస్, క్వాంటం ఆల్గరిథమ్స్ వంటి వాటిపై ఈ కంపెనీలు దృష్టి పెట్టనున్నాయి.
క్వాంటంరంగంలో పెట్టుబడులకు 15 సంస్థల ఒప్పందాలు
అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టంలో భాగస్వామ్యం అయ్యేందుకు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. తద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సెక్యూరిటీ, క్వాంటం సెన్సింగ్, క్వాంటం బయో ఫౌండ్రీ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయి. ఐక్యూ లీప్, ట్రై క్వాంటా ల్యాబ్స్, క్యూబిట్ ఫోర్స్, ఎస్ఆర్ఎం, క్వాంట్ ఫోకస్ ల్యాబ్స్ సహా పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.అత్యధికంగా క్వాంటం హార్డ్‌వేర్ అభివృద్ధికి 6 సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదిరింది. ఎంవోయూలతో రాష్ట్రం నుంచే క్వాంటం సెన్సింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. హెల్త్‌కేర్ అప్లికేషన్లు, డిఫెన్స్, ఏరోస్పేస్ అవసరాలకు స్వదేశీ క్వాంటమ్ టెక్నాలజీకి రూపకల్పన చేసే అవకాశం కలుగనుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు అనుగుణంగా హార్డ్‌వేర్, శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ – రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటుతో పాటు యువతకు దక్కనున్న క్వాంటమ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేసేందుకు వీలు కలుగనుంది.













