Andhrabeats

ఏపీ హైకోర్టు సీజేగా తొలి మహిళా లీసా గిల్ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తొలి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ లీసా గిల్‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, అనంతరం జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలవనున్నారు.

జస్టిస్ లీసా గిల్ చండీగఢ్‌లో 1966 నవంబర్ 17న జన్మించారు. కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ గర్ల్స్‌లో హ్యూమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ న్యాయశాఖలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పట్టాలు పొందారు.
1990లో న్యాయవాదిగా నమోదు అయి పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో విస్తృత అనుభవం సంపాదించారు. చండీగఢ్ యూనియన్ టెరిటరీతో పాటు పలు ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల తరఫున కూడా న్యాయవాదిగా వాదనలు వినిపించారు.
2014 మార్చి 31న పంజాబ్-హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, అదే ఏడాది డిసెంబరులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా న్యాయరంగంలో అనుభవం కలిగిన ఆమె ప్రస్తుతం దేశంలో ప్రముఖ మహిళా న్యాయమూర్తులలో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేవీ రఘు కుమార్, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయ రంగంలో మూడు దశాబ్దాల ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్ భారత న్యాయ వ్యవస్థలో అనుభవజ్ఞురాలైన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాలకు పైగా న్యాయరంగంలో సేవలందించిన ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టులో అనేక కీలక కేసులకు తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఆమె ప్రొఫైల్, విద్యాభ్యాసం, న్యాయరంగంలో ప్రయాణం, ముఖ్య తీర్పులు ఇలా ఉన్నాయి.
కుటుంబ నేపథ్యం – న్యాయ కుటుంబంలోనే పెరిగిన జడ్జి
జస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 17న చండీగఢ్‌లో జన్మించారు. ఆమె తండ్రి జస్టిస్ హర్‌ఫుల్ సింగ్ బ్రార్ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి. చిన్నప్పటి నుంచే న్యాయ వ్యవస్థపై అవగాహన ఉన్న వాతావరణంలో పెరిగిన ఆమె అదే రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు.


చదువు
స్కూలింగ్ – కార్మెల్ కాన్వెంట్ స్కూల్, చండీగఢ్
డిగ్రీ – గవర్నమెంట్ కాలేజ్ ఫర్ గర్ల్స్, చండీగఢ్
న్యాయ విద్య – పంజాబ్ యూనివర్సిటీ నుండి LLB, LLM
న్యాయ విద్య పూర్తయ్యాక ఆమె న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.
న్యాయవాదిగా కెరీర్
1990లో అడ్వకేట్‌గా నమోదు అయిన జస్టిస్ లీసా గిల్ పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
సివిల్, క్రిమినల్, సర్వీస్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో విస్తృత అనుభవం సంపాదించారు. చండీగఢ్ యూనియన్ టెరిటరీతో పాటు పలు ప్రభుత్వ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్ల తరఫున కూడా వాదనలు వినిపించారు.
న్యాయమూర్తిగా నియామకం
ఆమె న్యాయ అనుభవాన్ని గుర్తించి 2014 మార్చి 31న పంజాబ్-హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అదే ఏడాది ఆమె శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి పలు ముఖ్యమైన కేసుల్లో తీర్పులు ఇచ్చారు.
ముఖ్యమైన తీర్పులు
జస్టిస్ లీసా గిల్ పంజాబ్-హర్యానా హైకోర్టులో పనిచేసే సమయంలో పలు కీలక తీర్పులు ఇచ్చారు.

  1. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసు
    GST చట్టం ప్రకారం ఒక సంవత్సరానికి మించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్ చేయడం సరైంది కాదని ఆమె నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. వ్యాపారులకు ఇది ముఖ్యమైన తీర్పుగా నిలిచింది.
  2. బ్యాంకు ఆస్తి స్వాధీనం కేసు
    Punjab & Sind Bank కేసులో బ్యాంకులు ఆస్తులు స్వాధీనం చేసుకునే సమయంలో చట్టపరమైన విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని కోర్టు పేర్కొంది.
  3. క్రిమినల్ అప్పీల్ కేసు
    Ajit vs State of Haryana కేసులో సాక్ష్యాధారాల పరిశీలనలో సరైన విధానం పాటించాలనే అంశంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

TOP STORIES

Scroll to Top